Chnadrababu letter to AP CS: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొలసానపల్లి గ్రామంలో ప్రైవేటు వ్యక్తికి చెందిన స్టోన్ క్రషర్ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ఆక్రమించి అధికారంలో ఉన్న వారు చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే వారికి మద్దతుగా అధికారుల ఉండడం ఆందోళన కలిగిస్తోందని మండిపడ్డారు. పలమనేరు నియోజకవర్గంలో కొలసానపల్లి గ్రామంలో 1.170 హెక్టార్ల భూమిలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ జనార్ధన్ నాయుడు మైనింగ్ లీజు కలిగి ఉన్నారని, 2020 జూన్ లో స్థానిక వైకాపా ఎమ్మెల్యే, ఆయన బావమరిది మైనింగ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. యంత్రాలను, స్టోన్ క్రషర్ ను, టిప్పర్లను దౌర్జన్యంగా ఉపయోగించుకుంటూ.. గత రెండు సంవత్సరాలుగా కోట్ల రూపాయలు ఆర్జించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన ఆస్తులను ఆక్రమించారని ఫిర్యాదుదారు జిల్లా ఎస్పీకి, విద్యుత్, మైనింగ్ శాఖలకు, రెవెన్యూ వారికి అందరికీ ఫిర్యాదులు చేసినా ఏ విధమైన చర్యలు లేవని వాపోయారు.
ఫిర్యాదుదారుడు అప్పుతో కొన్న వాహనాలకు వాయిదాలు చెల్లించనందున ఫైనాన్స్ కంపెనీలు కోర్టులో అతనిపై దావాలు వేశాయని చంద్రబాబు గుర్తుచేశారు. ఆక్రమణదారులు గత 22 నెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించనందున బకాయిలు 25 లక్షల రూపాయలు దాటి పోయాయన్నారు. క్రషర్ ఆక్రమణలో ఉందని, విద్యుత్ బిల్లులు కట్టనందున భవిష్యత్ లో తనకు భారీ పెనాల్టీ పడే అవకాశం ఉన్నందున వెంటనే విద్యుత్ నిలిపివేయాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. విద్యుత్ నిలిపివెయ్యాలని విద్యుత్ శాఖపై హైకోర్టులో కేసు వేశారంటే రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో అర్ధమవుతుందన్నారు. లైసెన్స్ ఫీజులు చెల్లించనందుకు ఇప్పటి వరకు మైనింగ్ అధికారులు వారిపై ఏ చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకప్పుడు సుపరిపాలనకు పేరొందిన రాష్ట్ర అధికారులు ఇప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో భాగస్వాములు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పరిపాలన ఇలాగే కొనసాగి ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేక కోర్టులను ఆశ్రయించాలంటే సామాన్యుల జీవితం దుర్భరం అవుతుందని ఆక్షేపించారు. ఈ విషయమై విచారణ జరిపించి బాధితుడి న్యాయం చెయ్యాలని ప్రధాన కార్యదర్శిని కోరారు.
ఇవీ చదవండి: