జిల్లా అంతటా ఎన్నికల కోలాహలమే. త్వరగా అభ్యర్థులు ప్రకటించేసి ప్రచార రంగంలోకి దూకాలని అధినాయకత్వం ఆలోచిస్తుంటే... టికెట్ కోసం నెలకొన్న పోటీ వారిని ముందడుగు వేయనీయడం లేదు. ఏ క్షణంలో ఎవరి పేరు తెరపైకి వస్తుందోనన్న గందరగోళం శ్రేణుల్లో కనిపస్తోంది. ఇలా క్షణక్షణం మారుతున్న రాజకీయ లెక్కలతో చిత్తూరు జిల్లా రాజకీయం మంచీ రసపట్టులో ఉంది.
సీఎం సొంత జిల్లాలో పసుపు జెండా ఎగరాలన్న కసి తెలుగుదేశంలో కనిపిస్తోంది. ఆ దిశగానే అభ్యర్థుల ఎంపికలో అచితూచి అడుగులేస్తోంది. 14 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో 7 స్థానాలే ఖరారయ్యాయి. మిగిలిన ఏడింటిపై జరుగుతున్న సమాలోచనలు ఆశావహుల బీపీ పెంచేస్తోంది. వీటిపై ఇప్పటికే ఓ దఫా సమీక్ష చేపట్టిన చంద్రబాబు...పలు స్థానాలపై సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.
పలమనేరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే..మంత్రి అమర్‌నాథరెడ్డి పేరు ఖరారు చేశారు. ఈ స్థానం ఆశిస్తున్న ఆశావహులను అధిష్ఠానం బుజ్జగిస్తోంది. చిత్తూరులో మొగ్గు సత్యప్రభ వైపే ఉంది. పీలేరు నుంచి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు నుంచి అనీషారెడ్డి పేర్లు ఖరారైపోయాయి. తిరుపతి నుంచి మరోసారి సుగుణమ్మ నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఎలాగైనా చంద్రగిరి తమ ఖాతాలోకి వేసుకునేందుకు గురిపెట్టిన సైకిల్ పార్టీ... జిల్లా అధ్యక్షుడు పులవర్తి నానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మిగతా 7స్థానాలపై ఒకటెండ్రు రోజుల్లో స్పష్టత వస్తోందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
వైకాపాలోనూ టిక్కెట్లు ఎవరికి దక్కుతాయో అన్న సందిగ్ధత ఉంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అంచనాలన్నీ తారుమారవుతున్నాయి. సర్వేలు, సామాజిక సమీకరణాలను కొలబద్ధంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు మళ్లీ అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన పూతలపట్టులో కాంగ్రెస్‌లో పనిచేసిన ఓ మహిళా నేతను రంగంలోకి దింపేందుకు వైకాపా పరిశీలిస్తోంది. మదనపల్లె టిక్కెట్ విషయంలో కంగుతిన్న సిట్టింగ్ శాసనసభ్యుడు తిప్పారెడ్డి పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో మంతనాలు ముమ్మరం చేస్తున్నారు. తిరుపతి అభ్యర్థిత్వంపైనా తాజాగా చర్చ మొదలైంది. భూమన కరుణాకరెడ్డికి స్పష్టమైన సంకేతాలు రావడం లేదు. చంద్రగిరి, నగరి స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి ఖరారు కానున్నాయి. జిల్లాలో కీలక నాయకులు నిలబడే స్థానాలు తప్ప మిగతా స్థానాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో స్పష్టత కొరవడింది. సగం స్థానాలపై ప్రధాన పార్టీల ప్రకటనతో వేడెక్కిన చిత్తూరు రాజకీయం...మున్ముందు మరింత రసవత్తరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.