CBN FIRES ON JAGAN : తెలుగుదేశం సంపద సృష్టిస్తే.. వైకాపా దానిని విధ్వంసం చేస్తోందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికారం, పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం మిడిసిపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడున్నరేళ్లలో ఏం చేశారని.. కుప్పంలో జగన్ పర్యటిస్తున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు.. పోలీసు కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రజాసమస్యల కోసం పోరాడే పార్టీ మాది.. కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. ప్రభుత్వం పెడుతోన్న తప్పుడు కేసులు తమనేమీ చేయలేవని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఎం జగన్ నేర చరిత్రపై పోరాటం చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా పని చేస్తున్న పోలీసు అధికారుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కుప్పం అన్న క్యాంటీన్ ఘటనలో 72 తెదేపా నేతలపై కేసు పెట్టారని.. మరికొందరిపై హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. తెదేపా నేతలపై వివిధ సెక్షన్ల కింద పెట్టిన కేసులు దారుణమని మండిపడ్డారు. మీరు దాడులు చేసి.. తిరిగి మా నేతలపై కేసులు పెట్టారని.. సమావేశం పెట్టినప్పుడు ప్రజలు రారా అని ప్రశ్నించారు.
ప్రశాంతతకు మారుపేరైన కుప్పం నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకే సీఎం జగన్ పర్యటించనున్నారని చంద్రబాబు విమర్శించారు. మూడేళ్లలో ఏం అభివృద్ధి చేశారని జగన్ చూడటానికి వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తన పర్యటన సందర్భంగా వైకాపా శ్రేణులు దాడులు చేయడమేగాక.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేసిందని ఆయన విమర్శించారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న వారిని చంద్రబాబు పరామర్శించారు. చంద్రబాబు రాక సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడంతో జైలు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
"నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ జైలుకు వెళ్లి పరామర్శించలేదు. ఈ రోజు జైలులో ఉన్న ఎనిమిది మంది కార్యకర్తల్ని పరామర్శించా. కుప్పంలో అన్న క్యాంటీన్‌ను అడ్డుకొని.. మా కార్యకర్తలపైనే కేసులు పెట్టారు. జగన్‌ను కూడా తరిమికొట్టే రోజు వస్తుంది. కొందరు పోలీసులు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. 175 స్థానాల్లోనే కాదు.. పులివెందులలోనూ గెలుస్తామని సవాల్ చేస్తున్నా. పోలవరం, అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెబుతున్నారు"- చంద్రబాబు
తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ను రాష్ట్ర ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలుస్తామంటున్న జగన్.. ధైర్యముంటే సొంత నియోజకవర్గం పులివెందులో గెలవాని సవాల్ విసిరారు.
బాబాయి హత్య కేసును విచారిస్తున్న సీబీఐని కూడా బెదిరించే స్థాయికి జగన్ చేరారని చంద్రబాబు.. ఆక్షేపించారు. అదే సీబీఐ చేతిలో జగన్‌పై 11 కేసులు ఉన్నాయని.. వారు గట్టిగా బటన్ నొక్కితే జగన్ పరిస్థితేంటని ప్రశ్నించారు.
పోలీసుల జీపు ఢీకొని తీవ్రంగా గాయపడి.. రెండు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన.. చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతను.. ఆమె నివాసంలో చంద్రబాబు పరామర్శించారు. సర్వం కోల్పోయిన హేమలత కుటుంబానికి అండగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ.. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అత్తమామల హంతకులను శిక్షించాలని న్యాయం కోసం పోరాడుతున్న హేమలతకు.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: