CDS Bipin Rawat personal security guard Saiteja died: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన బి.సాయితేజ (29) మృతి చెందారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను మెప్పించి, ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఒకరిగా ఎదిగిన సాయితేజ మరణం అందరిని కలచివేసింది.
సాయితెేజ ప్రస్థానం
కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన మోహన్, భువనేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన సాయితేజ 2012లో ఆర్మీ సిపాయిగా బెంగళూరు రెజిమెంట్ నుంచి ఎంపికయ్యారు. కొంతకాలం జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వర్తించారు. ఏడాది తర్వాత పారా కమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. ఎంపిక నుంచి శిక్షణ వరకు అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొని పారా కమాండో అయ్యారు. మెరుపుదాడులు చేయడంలో దిట్టలైన వీరికి సైన్యంలో ప్రత్యేక స్థానం ఉంది. పారా కమాండోగా బెంగళూరుతో పాటు వివిధ వాతావరణ పరిస్థితుల్లో రాటుదేలారు. ఆకాశమార్గంలో నేరుగా శత్రుస్థావరాలకే వెళ్లి, వారిని మట్టి కరిపించే పారా ట్రూపర్‌గా ఎదిగారు. ఇందుకోసం కఠోర శిక్షణ పొందారు. అనంతరం సాయితేజ కొత్తగా వచ్చే పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఆయనలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి.. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. రావత్ ఆయనను చాలా అభిమానించేవారని స్నేహితులు అంటున్నారు. తమ్ముడు మహేష్‌బాబును సైతం సైన్యంలో చేరమని ప్రోత్సహించి, మెరుగైన శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం ఆయన సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్నారు.
కుమార్తెను చూడాలని ఉంది..
jawan Saiteja last call : సాయితేజకు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ (5), కుమార్తె దర్శిని (2) ఉన్నారు. రావత్‌కు వ్యక్తిగత భద్రత సిబ్బందిగా చేరాక దిల్లీలోనే ఉంటున్నారు. సాయితేజ ఏడాది కిందట తన కుటుంబాన్ని మదనపల్లెకు మార్చారు. ఈ ఏడాది వినాయకచవితికి వచ్చి, కుటుంబసభ్యులతో గడిపారు. బుధవారం ఉదయం 8.15 గంటలకు భార్య శ్యామలకు సాయితేజ ఫోన్ చేశారు. కుమార్తె దర్శినిని చూడాలని ఉందంటూ.. వీడియోకాల్ చేయాలని భార్యకు చెప్పి, పిల్లల్ని చూస్తూ సంతోషంగా మాట్లాడారు. కొన్ని గంటల్లోనే సాయితేజ మరణించారనే కబురు విని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
పరామర్శలు..
helicopter crash: సాయితేజ మరణ వార్త విని ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు నెలకొన్నాయి. పలువురు సాయితేజ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
ఇదీ చదవండి