వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ తిరస్కరణపై మండిపడ్డ ఆయన శ్రీకాళహస్తిలో అన్ని ఎన్నికలను బహిష్కరించాలని అఖిలపక్షాలకు పిలుపునిచ్చారు. గతంలో శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, రేణిగుంట మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరించి.. వైకాపా అభ్యర్థులకు ఏకగ్రీవంగా పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. అదే రీతిలో ప్రస్తుతం సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు పెద్ద ఎత్తున తిరస్కరించి ఏకగ్రీవాలకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమోదించిన నామినేషన్లు రాత్రికి రాత్రే ఎలా తిరస్కరణకు గురయ్యాయని ప్రశ్నించిన ఆయన... 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైకాపా ఎన్నికలకు భయపడి ఇలా అవినీతికి పాల్పడడం దారుణమన్నారు. నియోజకవర్గంలోని అఖిలపక్ష నేతలంతా కలిసికట్టుగా ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వంలో అధికారులు పనితీరు సైతం సక్రమంగా లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...