చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-ఐషర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. పలమనేరు నుంచి బంగారుపాలెం మండలం టేకుమందలో జరుగుతున్న జాతరకు ఆటో వెళ్తోంది. పలమనేరు దాటిన తర్వాత ఆంజనేయస్వామి గుడి వద్ద చిత్తూరు నుంచి పలమనేరు వైపు వస్తున్న ఐషర్ వాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ప్రమాదంలో మల్లికార్జున్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ రెడ్డెమ్మ, వెంకటప్ప కన్నుమూశారు. మెరుగైన వైద్యం కోసం శీనప్ప అనే వ్యక్తిని పెద్దాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. ఆటో చోదకుడు ఇషార్ బాషాతో పాటు మిగిలిన క్షతగాత్రులు చికిత్స తీసుకుంటున్నారు. గాయపడిన వారిలో నాలుగేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బాలుడికి మెరుగైన వైద్యం కోసం కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీకి పంపారు. బాధితులు బైరెడ్డిపల్లె మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వారు ఉన్నారు.
ఇది కూడా చదవండి.