కరోనా ప్రభావంతో ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్ర పర్యటక అభవృద్ధి సంస్థ ప్రత్యామ్నాయ అదాయ మార్గాలను ఎంచుకొంది. పర్యటకుల రాకపోకలు లేని పరిస్థితుల్లో తమ సిబ్బంది ద్వారా పరోక్షంగా కరోనా రోగులకు సేవలు అందిస్తూ... ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. కరోనాకు ముందు శ్రీవారిని దర్శించుకొనేందుకు తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి వంటి పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులను తిరుమలకు తీసుకురావడమే కాక వసతి, దర్శన సౌకర్యాలను కల్పించడం ద్వారా తిరుపతి పర్యాటక డివిజన్‌కు ఆదాయం సమకూరేది.
ఆదాయం కోల్పోయిన ఏపీటీడీసీ
రోజుకు మూడు వేల చొప్పున శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే... పర్యాటక శాఖకు కేటాయించేది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో రోజుకు పన్నెండు వేల మందికి మాత్రమే దర్శనాలకు అవకాశం ఉంది. పర్యటక అభివృద్ధి (ఏపీటీడీసీ) సంస్థకు కేటాయిస్తున్న టికెట్లను తితిదే రద్దు చేసింది. ఫలితంగా... ఏపీటీడీసీ పూర్తిగా ఆదాయం కోల్పోయింది.
బస్సుల డ్రైవర్లు, సహాయకులు, ఇతర ఆఫీసు సిబ్బంది కార్యాలయాలకే పరిమితం కాగా... వారి సేవలను ఇతర ప్రాంతాల్లో వినియోగించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. స్టేట్ ఇనిస్ట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థతో కలిసి కరోనా రోగులకు ఆహార పదార్థాల పంపిణీ చేపట్టారు.
సంస్థ మనుగడ కోసం..
స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌తో (ఎస్ఐహెచ్ఎమ్ ) కలిసి కరోనాతో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు. ఏపీటీడీసీ కార్యాలయం పక్కనే ఉన్న ఎస్ఐహెచ్ఎమ్ వంటశాలలను వినియోగించుకొని ఆహార పదార్థాలను తయారు చేయడం ప్రారంభించింది. కరోనా రోగుల ఆహార పదార్థాలకు అవసరమైన వంట సామాగ్రి...తితిదే సమకూర్చుతుండగా ఎస్ఐహెచ్ఎమ్ వంటశాలలో ఆహారాన్ని తయారుచేసి రోగులకు అందచేస్తోది.
తిరుపతి నగరంలోని కోవిడ్ కేర్ కేంద్రాలు శ్రీనివాసం, మాధవం వసతిగృహాలతో పాటు రుయా ఆసుపత్రి, ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో చికిత్స పొందుతున్న దాదాపు రెండు వేల మంది కరోనా రోగులకు ఆహారాన్ని సరఫరా చేస్తోంది. ఆహార పదార్థాలను పొట్లాలు కట్టడం, వాటిని రోగులకు చేరవేయడం వంటి పనులను డ్రైవర్లు, ఇతర సిబ్బంది నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో సంస్థ మనుగడ కోసం...కరోనా రోగులకు సేవ చేయడం కోసం ఆహార పదార్థాల ప్యాకింగ్ పనులు చేపట్టినట్లు డ్రైవర్లు తెలిపారు.
ప్రత్యామ్నాయ పనుల ద్వారా తమ ఉద్యోగానికి భద్రత కల్పించుకోవడంతోపాటు... కరోనా రోగులకు సేవలు అందిస్తున్నామన్న తృప్తి మిగులుతోందని పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగుల అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: