లాక్డౌన్ నిబంధనల సడలింపులతో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో తెరుచుకున్న మద్యం దుకాణం తొలి రెండురోజులు మందుబాబులతో కిక్కిరిపోయింది. ప్రస్తుతం కొనుగోలుదారులు లేక వెలవెలబోయింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కండ్రిగ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతం. తమిళనాడులో లాక్డౌన్ అమలు కొనసాగుతున్న కారణంగా కండ్రిగలోని మద్యం దుకాణాల ముందు మందుబాబులు మొదటి రెండురోజులు బారులు తీరారు. కానీ ప్రస్తుతం దుకాణాల వద్ద వినియోగదారులు కనిపించడం లేదు.
జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం గారచెట్లపల్లి గ్రామం ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతం. ఈ గ్రామం ద్వారా కర్ణాటక రాష్ట్ర మద్యాన్ని చిత్తూరు జిల్లాకు అక్రమంగా తీసుకొస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ములకలచెరువు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.