జగన్ మంత్రివర్గం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం వైకాపా శాసన సభాపక్షం సమావేశం కానుంది. ఈ భేటీలోనే ముఖ్యమంత్రి జగన్, మంత్రుల పేర్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముందుకు తీసుకు వస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరెవరిని ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకున్నామన్న విషయంపై వారికి వివరించనున్నారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, రాజకీయ పరిణామాల వంటి వాటి ఆధారంగానే మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్లు ఆయన వారికి చెప్పనున్నారు.
అన్నీ.. ఆయనొక్కరే!
కొందరు ఎమ్మెల్యేలకు గురువారమే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని, వెంటనే బయల్దేరి రమ్మని వర్తమానం పంపారన్న ప్రచారం జరిగింది. అయితే... శుక్రవారం జరగనున్న శాసన సభాపక్ష సమావేశానికి రావాలని మాత్రమే.. అదీ పార్టీ నుంచి ఆ ఎమ్మెల్యేలకు సమాచారం అందిందని తెలిసింది. మంత్రివర్గంపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటివరకూ పార్టీ సీనియర్ నేతలతో కూడా చర్చించలేదని, జాబితా మొత్తం పూర్తిగా ఆయనే సిద్ధం చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం మాత్రం కొందరు సీనియర్ నేతలను అందబాటులో ఉండాలని జగన్ చెప్పారని తెలిసింది. సాయంత్రం వైవీ సుబ్బారెడ్డి లాంటి నేతలు హడావుడిగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వారితో జగన్ మంత్రివర్గ జాబితాపై చర్చించారా.. లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు.
అమరావతికి ఆశావహులు...
కాబోయే మంత్రుల పేర్లు బయటకు రాకపోవడంతో గురువారం సాయంత్రానికే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు విజయవాడకు చేరుకున్నారు. మంత్రివర్గ జాబితాలో తమ పేరుందా... లేదా అని జగన్‌కు సన్నిహితులనుకునే నేతలను ఆరా తీసే ప్రయత్నాలు చేశారు. మరోవైపు గవర్నర్ నరసింహన్ శుక్రవారం సాయంత్రానికి విజయవాడ చేరుకోనున్నారు. శనివారం ఉదయం 11.49 గంటలకు కొత్త మంత్రులతో ఆయన ప్రమాణస్వీకారం చేయిస్తారు.
ఇదీ చదవండీ: కుదరని ఏకాభిప్రాయం... ఆర్టీసీలో చర్చలు విఫలం