దిల్లీ ధర్మపోరాట దీక్ష తర్వాత ఈ రోజు చంద్రబాబు ఏపీ విభజన హామీల అమలు, సమస్యలపై రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. ఆ పదిహేడు పేజీల వినతి పత్రంలో పది మఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1. 2014 ఫిబ్రవరి 20న పార్లమెంటులో నాటి ప్రధాని ప్రత్యేక హోదా సహా 6 హామీలు ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క హామీ నెరవేరలేదు.
2. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాలి. 62 వేల 623 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్ పంపించాం. 2014-17 మధ్యలో 1500 కోట్లే మంజూరు చేసింది. తర్వాత ఒక్క పైసా విడుదల చేయలేదు.
3. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి 2019, ఫిబ్రవరి 11 వరకు కేంద్రం ఇంకా రూ. 4021 కోట్లు చెల్లించాలి. 2018లో కేంద్రం ఒక్క పైసా విడుదల చేయలేదు.
4. కడప ఉక్కు పరిశ్రమపై రాష్ట్రం నివేదిక ఇచ్చినా... నాలుగున్నరేళ్లుగా పట్టించుకోలేదు. సీమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వమే కడప ఉక్కు పరిశ్రమకు పునాది రాయి వేసింది.
5. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తానని కేంద్రం మాట తప్పింది. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ వెంటనే ఏర్పాటు చేయాలి.
6. వెనుకబడిన జిల్లాలకు ఐదేళ్లు 24,350 కోట్లు కోరాం. ఏడాదికి 350 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సమ్మతించింది. 2014- 17 వరకు 1050 కోట్లు ఇచ్చింది. 2017-2018 కి 350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది.
7. ఆస్తుల పంపకాలు స్థలం ప్రాతిపదికన.... అప్పులు జనాభా ప్రాతిపదికన జరిగాయి. ఏపీ, తెలంగాణలో పన్నుల తిరిగి చెల్లింపులు జనాభా ఆధారంగా జరుగుతున్నాయి. పన్ను వసూల్లు ప్రాంతం ప్రకారం జరుగుతుంది ఫలితంగా ఏపీ 3,800 కోట్ల ఆర్థికలోటు నెలకొంది. దీనిని సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరాం. లేకపోతే ఆ లోటు భర్తీ చేయమన్నాం.
8. పద్నాలుగో ఆర్ధిక సంఘం నివేదిక ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ ఐదేళ్లు ఇస్తామన్నారు. ఎస్పీవీ ఏర్పాటు చేసుకోమని సూచించింది. రాష్ట్ర భవిష్యత్ ఇబ్బందిలో పడుతుందని మేం అంగీకరించలేదు.
9. ఏపీని ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి, విభజన చట్టం కింద రాయితీలతో కూడిన ప్రత్యేక ప్యాకేజ్ నివేదికను కేంద్రానికిచ్చాము. ఇప్పటి వరకు ఈ అంశం పై కేంద్రం స్పందించలేదు.
10. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 11 విద్యాసంస్థలు ఇస్తామన్నారు. 7 సంస్థలు ఇచ్చినా తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగిలిన వాటిని పక్కన పెట్టారు.