విజయవాడలోని పెనమలూరు చిన్నారులు మొన్నటి వరకు పుస్తకాలు పట్టి సెలవుల్లో వాటి జోలికే పోవడం లేదు. సంగీతం, నృత్యం సాధన చేస్తూ బిజిబిజీగా మారిపోయారు.
ఎమ్మెల్యే సహకారంతో...
నేటితరం పిల్లలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సంగీతం, నృత్యాన్ని అలవర్చాలన్న ఉద్దేశంతో విజయవాడకు చెందిన నాట్య గురువు ఎడం నరేంద్ర కుమార్..20 ఏళ్లుగా వీటిని నేర్పిస్తున్నారు. పిల్లలకు వారి ఆసక్తిని బట్టి భరతనాట్యం, కూచిపూడి, జానపదకళల్లో తర్ఫీదునిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం పోరంకిలో చిన్నపాటి గది అద్దెకు తీసుకుని పిల్లలకు నాట్యం నేర్పించేవారు. శిష్యుల సంఖ్య పెరిగి ఇబ్బంది పడుతున్న ఆయన పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్... తన కార్యాలయంలోని షెడ్‌ను అప్పగించారు. శిక్షణ కోసం కావాల్సిన మౌలిక వసతులు కల్పించారు.
ఈ తరహా శిక్షణతో ఎంతో ప్రయోజనం ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రాచీన కళలు నేటి తరానికి అందించాలనే లక్ష్యంతోనే వేసవిలో ఈ తరహా శిక్షణ కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.