నేడు సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ చేశారు.10 లక్షల మంది సైన్యంతో అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయిస్తే... పసుపు సైన్యం 65 లక్షల మంది అని గుర్తు చేశారు. కోటిమంది అక్కాచెల్లెళ్ల అండ.. తెదేపాకు ఉందన్నారు. రైతులు, పింఛనర్లు, యువత, డ్రైవర్ల అండతో ఎన్నికలు ఏకపక్షం కానున్నాయని.. తెదేపా విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం మళ్లీ సుప్రీం కోర్టులో కేసు వేసిందని గుర్తు చేశారు. అలాంటి వాళ్లతో ప్రతిపక్ష నాయకుడు జగన్ అంటకాగుతూ రాష్ట్రంలో ఓట్లు ఎలా అడుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. రానురాను ఎన్నికల యుద్ధంలో వైకాపా మరింత దిగజారుతోందని అభిప్రాయపడ్డారు.
వైకాపాకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుందని సీఎం అన్నారు. వైకాపాకు ఓటేస్తే దాడులు-దౌర్జన్యాలు పెరిగి, భూములు-ఆస్తులకు, ఆడబిడ్డలకు భద్రత ఉండదని స్పష్టం చేశారు. చిన్నాన్నతో జగన్మోహన్‌రెడ్డికి రాజకీయ వైరాలున్నాయని, చిన్నాన్ననే కొట్టాడని గతంలో జగన్‌పై మీడియాలో వార్త వచ్చిందని సీఎం గుర్తు చేశారు. మొదటినుంచి వివేకానందరెడ్డికి వేధింపులు జగన్ నుంచే అని ఆరోపించారు. చిన్నాన్న హత్యనే... గుండెనొప్పిగా పక్కదారి పట్టించారన్నారు.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలుఅభివృద్ధికి, అరాచకానికి మధ్యజరగనున్నట్టు కార్యకర్తలతో చంద్రబాబు అన్నారు.