ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు... బలహీనవర్గాల ప్రజలకు ఉగాది రోజు 25 లక్షల ఇళ్ల పట్టాలిస్తామని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. గ్రామాల్లో స్థల సేకరణపై అధికారులతో చర్చించామన్న మంత్రి సుభాష్ చంద్రబోస్... ప్రస్తుతం 11,140 ఎకరాల ప్రభుత్వ స్థలాలున్నాయని అధికారులు తెలిపారన్నారు. గ్రామాల్లో స్థలాలను పరిశీలించాలని కలెక్టర్లు, తహసీల్దార్లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ఇప్పటి వరకు 26,75,384 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గ్రామాల్లో స్థలాలు కొనేందుకు రైతులను ఒప్పించాలని కోరినట్లు పేర్కొన్నారు.
25 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు రుణం ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. బ్యాంకుల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ఇంటి స్థలం తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండీ... సీఎం జగన్తో మేజర్ జనరల్ భేటీ