సముద్రంలో వృథాగా పోతున్న గోదావరి జలాలను వీలైంత ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు....అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే అంశంపై ఇరువురు సీఎంలు చర్చించినట్లు తెలిసింది. ప్రాణహిత ద్వారా ఎంత నీరు వస్తుంది..? కాళేశ్వరం ద్వారా మళ్లించే నీరెంత.? ఇంద్రావతి నదిలో ఉండే ప్రవాహం ఏంటి.. అన్న విషయాలపై కేసీఆర్, జగన్ చర్చించారు. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత... ఆ నీటిని శ్రీశైలం జలాశయానికి మళ్లిస్తే కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేయోచ్చని జగన్‌కు కేసీఆర్ సూచించారు. అయితే ఈ పథకాన్ని ఇరు రాష్ట్రాలు కలిసి చేపట్టాలా?, రాష్ట్ర ప్రభుత్వమే చేపడితే తెలంగాణ ప్రభుత్వం సహకరించడమా అన్న విషయంలో స్పష్టత రాలేదు.
ఈ పథకాన్ని తక్షణమే పట్టాలెక్కించాలని భావిస్తున్న సీఎం జగన్...జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టేల్‌పాండ్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. గోదావరి- పెన్నా అనుసంధాన పనులు చేపట్టినా ఇవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. గోదావరి నీటిని మళ్లిస్తే కానీ...కృష్ణా, పెన్నాపరిధిలో అవసరాలు తీరేలా కనిపించడం లేదు. ఈ కారణంగానే.. ఈ పథకాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు, ఇచ్చంపల్లి నుంచి పులిచింతలకు అనుసంధానం చేసే ప్రతిపాదనలూ ఉన్నాయి. అయితే.. దీనికి అవసరమైన నీటి లభ్యత లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. తమ అవసరాలు తీరాక మిగిలిన నీటిని మాత్రం తీసుకెళ్లొచ్చని తెలిపింది. అయితే ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే.... కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ మునిగిపోయే ప్రమాదముంది. తక్కువ ఎత్తుతో 95 మీటర్ల పూర్తిస్థాయి మట్టంతో బ్యారేజీ నిర్మిస్తే 31 టీఎమ్సీల నీటిని నిల్వ చేయోచ్చు. ఇక్కడ నుంచి 299 టీఎమ్సీల నీటిని తరలించవచ్చని జాతీయ జల అభివృద్ధి సంస్థ అంచనా వేసింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించాలంటే 107 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. మార్గమధ్యలో మూసీకి, పులిచింతలకు నీటిని మళ్లించే అవకాశం ఉంది. దీనికోసం దాదాపు 7వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు 30వేల 375 కోట్లకు చేరనుంది.
ఈ నేపథ్యంలో... తాజాగా గోదావరి నుంచి శ్రీశైలానికి నీటిని తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే.