Telugu Desam Party Jai Bhim Jai Sabha updates: 'దళితులకు ఉపముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఇచ్చామని వైఎస్సార్సీపీ గొప్పలు చెప్పుకుంటుంది... కానీ, తాళాలు మాత్రం రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి' అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన.. జై భీమ్ జై తెలుగుదేశం బహిరంగ సభలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, వంగలపూడి అనిత, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
సభ ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ నేతలు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టలేని దద్దమ్మ సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. అమరావతిలో టీడీపీ హయాంలో రూ.30 కోట్లతో తలపెట్టిన అంబేడ్కర్ స్మృతివనాన్ని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా ఇంకొల్లులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా 'జై భీమ్ జై తెలుగుదేశం' అనే పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ..''మీ అన్నని, తమ్ముడిని, బిడ్డని అని మహిళలకు మాయమాటలు చెప్పి సీఎం జగన్ అధికారంలోకి వచ్చాడు. కానీ, నేడు మహిళలపై రోజురోజుకి పదుల సంఖ్యలలో దాడులు జరుగుతుంటే అరికట్టలేని ఓ దద్దమ్మలాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చూస్తూ ఉండిపోతున్నాడు. దళితులకు శిరోముండనం చేయించిన వ్యక్తి జగన్. మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో దళితుడైన కిరణ్‌ను పోలీసులతో కొట్జి చంపించాడు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివాడిని చేసి చనిపోయేలా చేశాడు. నారా లోకేశ్ పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోంది. అంబేద్కర్ స్ఫూర్తితో 'యువగళం' పాదయాత్ర ముందుకు సాగుతుంది'' అని ఆమె అన్నారు.
రాష్ట్రంలో ఉన్న దళితులు తన మేనమామలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. అధికారం చేపట్టాక దళితుల నెత్తిమీద ఏక్కి వారిని అణగదొక్కుతున్నాడని..మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితుల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ పాలనలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. అమరావతిలో టీడీపీ హయంలో రూ. 30 కోట్లతో నిర్మించతలపెట్టిన అంబేడ్కర్ స్మృతివనాన్ని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి