TDP Chief Chandrababu In Public Meeting At Khammam: తెలంగాణలోని ఖమ్మం నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో తమ భవిష్యత్ ప్రణాళికను వివరించారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను చేసిన చేసిన కృషిని వివరించిన బాబు.. మళ్లీ తెలంగాణలో పార్టీని క్రియాశీలకం చేయాలని కార్యకర్తలను కోరారు. తెలుగుదేశం తరఫున గెలిచిన నేతలు వేరే పార్టీలోకి వెళ్లారని.. పార్టీ అవసరం అనుకునే నేతలంతా తిరిగి రావాలని ఆహ్వానించారు. కాసాని జ్ఞానేశ్వర్ వంటి నేతలను తయారుచేసి తెలంగాణలో టీడీపీని పున:నిర్మించి.. పూర్వ వైభవం తీసుకొద్దామని సభాముఖంగా ప్రకటించారు.
ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉంది: ఖమ్మంలో జరిగిన మీటింగ్.. రాబోయే రోజుల్లో టీడీపీని తిరుగులేని పార్టీగా తయారు చేస్తుందని దానికి మీరంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఫౌండేషన్ వేయకపోతే హైదరాబాద్ ఇంత అభివృద్ధి అయ్యేదేనని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఆనాడు తాను వేసిన పునాది వల్లే నేడు తెలంగాణలో ఇంత అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు. తన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు తనను అనుసరించినట్లు తెలిపారు.
ఏపీలో ఎటు చూసినా విధ్వంసమే: తన ప్రసంగంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. తెలంగాణలో తన విజన్‌ను తన తరువాత ముఖ్యమంత్రులు అనుసరిస్తే.. ఏపీలో మాత్రం ఇప్పటి సీఎం విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో భద్రాచలం మునగకుండా కరకట్ట ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. విడిపోయినా రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చేసుకోవాలని.. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలనే తాను కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు.
"ఖమ్మంలో జరిగిన మీటింగ్ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని పార్టీగా తయారుచేస్తోంది. దానికి మీరు అందరూ సహకరించాలి. మళ్లీ ఈ పార్టీ అవసరం ఉంది అనుకున్న వాళ్లు అందరూ ఈ పార్టీలోకి తిరిగి రావాలని.. పూర్వ వైభవానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరికీ పిలుపునిస్తున్నాను. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను." - చంద్రబాబు, టీడీపీ అధినేత
'ఇదే స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా బహిరంగ సభలు': అభివృద్ధికి చిరునామాగా తెలుగుదేశం పార్టీకి గుర్తింపు ఎప్పటికీ ఉంటుందని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఖమ్మం బహిరంగ సభ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. సభ అనంతరం చింతకాని మండలం పాతర్లపాడులో చంద్రబాబు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగువారు ఉన్నంత కాలం వారి గుండెల్లో ఎన్టీఆర్ నిలిచి ఉంటారని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: