AP Constable Jobs Preliminary Exam updates: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నేతృత్వంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 997 పరీక్ష కేంద్రాల్లో ప్రాథమిక రాత పరీక్ష మొదలైంది. రాత పరీక్ష విషయంలో అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి అనుమతిస్తామని, 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు నిబంధన విధించారు. ప్రభుత్వం విధించిన సమయపాలన నిబంధన అభ్యర్థులకు తిప్పలు తెచ్చింది. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేక కొంతమంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు.
బాపట్ల జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజిలో పరీక్ష రాసేందుకు పాలెం నుంచి బయలుదేరిన భూ లక్ష్మి అనే అభ్యర్థిని కర్లపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడింది. దీంతో ఆసుపత్రిలో కట్టు కట్టించుకొని 10 గంటల 2నిమిషాలకు పరీక్షా కేంద్రానికి చేరుకుంది. అయితే, పోలీసులు అనుమతి లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అక్కడకు రాగా.. ఆయనను కూడా అనుమతి ఇవ్వాలని వేడుకొంది. నిబంధనలు పాటించాలని ఎస్పీ చెప్పడంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది. మరో ముగ్గురు అభ్యర్థులు సైతం ఈ పరీక్ష కేంద్రానికే ఆలస్యంగా వచ్చి అవకాశాన్ని కోల్పోయారు.
పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి త్వరగానే బయలుదేరినా మార్గమధ్యలో జరిగిన కొన్ని అవాంతరాల వల్ల కొన్ని నిమిషాలు ఆలస్యమైందని, తప్పును మన్నించి పరీక్షా రాసే అవకాశాన్ని ఇవ్వాలని అధికారులను చాలాసేపు వేడుకున్నారు. అయినా కూడా అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అధికారులు అనుమతించకపోవటంతో కన్నీరు మున్నీరు అవుతూ పరీక్షకు దురమయ్యారు. జిల్లాలో పోలీసు నియామక పరీక్ష సజావుగా జరుగుతోందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అభ్యర్థులు ఎవరైనా రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
మరోపక్క పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సెక్షన్ 144 విధించారు. ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి, స్ట్రాంగ్ రూంలు, సీసీ కెమెరాల పనితీరును పరీక్షించారు. 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తం 5.03 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది.