AP HRDI: రాష్ట్ర విభజన తర్వాత బాపట్లలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థను.. గుట్టుచప్పుడు కాకుండా విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. విశాఖలోని చెంగల్రావుపేటలో నగరపాలక సంస్థకు చెందిన పాత భవనాన్ని అద్దెకు తీసుకుంది. దాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో రెండు మూడు నెలల్లో అది సిద్ధమవుతుందని తెలుస్తోంది.
బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రస్తుతం ఆరేడుగురు ఉద్యోగులతో నామమాత్రంగా కొనసాగుతోంది. దానిలోని సిబ్బందిని ఇప్పటికే గుంటూరు, విజయవాడలకు తరలించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ఇక్కడినుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని కూడా ఎక్కడికీ తరలించేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వకుండా హెచ్‌ఆర్‌డీఐని విశాఖకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
విశాఖ వన్‌టౌన్ ప్రాంతంలోని జీవీఎంసీకి చెందిన పాత భవనాన్ని నెలకు రూ.3లక్షల రూపాయలు చెల్లించే ప్రాతిపదికన హెచ్‌ఆర్‌డీఐ అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. మధురవాడకు సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఏపీహెచ్‌ఆర్‌డీఐ ప్రాంతీయ కార్యాలయం ఇది వరకే ఉంది. బాపట్లలోని నలుగురైదుగురు ఉద్యోగుల్ని ఇటీవల అక్కడికి తరలించారు. భవిష్యత్తులో ఆ భవనాన్ని శిక్షణ కోసం వచ్చేవారికి వసతి కోసం వినియోగించాలన్న ఆలోచనలో ఉన్నారు.
AP HRDI: రాష్ట్ర విభజన తర్వాత మొదట ఏపీహెచ్‌ఆర్‌డీఐను కొన్నాళ్లు నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో నిర్వహించారు. ఆ తర్వాత బాపట్లకు మార్చారు. ట్రైనీ ఐఏఎస్‌లతోపాటు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఇక్కడ శిక్షణ తరగతులు జరిగేవి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, లక్షదీవులు వంటి ప్రాంతాల నుంచీ శిక్షణ కోసం ఇక్కడికి వచ్చేవారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా కొన్నాళ్లు శిక్షణ తరగతులు జరిగాయి. ఆ తర్వాత కొవిడ్ వల్ల నిలిచిపోయాయి.
బాపట్లలో ఏపీహెచ్‌ఆర్‌డీఐకి ఐదు ప్రధాన భవనాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, వసతి గృహాలు, మెస్‌లు వంటివి మరో 8 ఉన్నాయి. వాటిలో ఒక ప్రధాన భవనం, హాస్టల్ బిల్డింగ్, కాన్ఫరెన్స్ హాల్‌ని ఏపీహెచ్‌ఆర్‌డీఐకి ఉంచి, మిగతా భవనాలన్నీ బాపట్ల జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలం, ఇతర జిల్లా స్థాయి కార్యాలయాలకు కేటాయించారు. బాపట్లలోని ఏపీహెచ్‌ర్‌డీఐలో ఒకప్పుడు 80 మంది వరకు రెగ్యులర్ సిబ్బంది ఉండేవారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులతో కలిపి ఈ సంఖ్య 150 వరకు ఉండేది. ప్రస్తుతం అక్కడ కేవలం ఆరేడుగురు ఉద్యోగులు మాత్రమే మిగిలారు.
ఇదీ చదవండి: టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం.. సుమారు రూ.20లక్షల ఆస్తినష్టం