POLICE ENQUIRY: బాపట్ల జిల్లా వేమూరు మండలంలో కొందరు యువకుల మధ్య జరిగిన గొడవపై పోలీసులు చేపట్టిన విచారణ వివాదాస్పదంగా మారింది. దీనిపై బాధితులు తొలుత తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వర్గం యువకులను బుధవారం రాత్రి విచారణకు పిలిచిన ఎస్సై అనిల్‌కుమార్ ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడి తలకు గాయమైంది. అతణ్ని స్టేషన్‌లోనే ఉంచి వైద్యం చేయిస్తామని పోలీసులు చెప్పగా, బయట వేచి ఉన్న తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి తన తలపై కత్తితో గాయపరిచారని వాపోయాడు. విచారణకు పిలిచి గాయపరుస్తారా అని యువకుడి తండ్రి పెద్దగా కేకలు వేస్తున్న దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. బంధువులు గాయపడిన యువకుడిని చికిత్స కోసం తెనాలి తీసుకువెళ్లారు. తర్వాత స్థానిక రాజకీయ నాయకుల జోక్యంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాను కిందపడటంతో తలకు గాయమైందని పోలీసుల ఎదుట యువకుడు వెల్లడించినట్లు చుండూరు సీఐ కల్యాణ్‌రాజ్ తెలిపారు.
పోలీసులు ఏమంటున్నారు?: వేమూరు పోలీసుల కథనం ప్రకారం మండలంలో జంపనికి చెందిన ఓ యువకుడు మత్తుమందు వినియోగిస్తున్నాడంటూ అతని తల్లిదండ్రులకు మరో యువకుడు చెప్పాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న యువకుడు ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ నెల 4న అతణ్ని గ్రామ శివారుకు తీసుకెళ్లి కర్రలు, చర్నాకోల్‌తో కొట్టారు. విషయం తెలిసి పెద్దలు రాజీకి ప్రయత్నించినా ఫలించకపోవడంతో ఈ నెల 6న బాధితుడు వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై అనిల్‌కుమార్ ఇరువర్గాల యువకులు, పెద్దలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, విచారణ అనంతరం బయటకు పంపారు. స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా ముగ్గురిలో ఒకడైన మహమ్మద్ రఫీ కాలుజారి కింద పడడంతో తలకు గాయమైందని, బంధువులు అతణ్ని 108లో తెనాలిలోని వైద్యశాలకు తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు.
వీఆర్‌కు ఎస్సై.. విచారణకు ఆదేశం
పోలీస్‌స్టేషన్‌లో రఫీని చితకబాది, తలపై కత్తితో గాయపరిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమూరు ఎస్సై అనిల్‌కుమార్‌ను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్తర్వులిచ్చారు. అతనితోపాటు యువకుడిని చితకబాదారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లపైనా విచారణ నిర్వహించాలని ఆదేశించారు. విచారణాధికారిగా బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావును నియమించారు.
ఇవీ చదవండి: