YCP MLA Meda Mallikarjun Reddy Land Mafia: అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో కొన్నేళ్లుగా భూముల దందాకు మేడా మల్లికార్జునరెడ్డి తెర లేపారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ భూముల్ని తన అధీనంలోకి తీసుకున్నారు. తోటల పెంపకం చేపట్టారు. ఆ తర్వాత అధికారుల సహకారంతో వాటికి డీకేటీ పట్టాలుగా ముద్ర వేయించుకున్నారు. ఏదో ఒక రూపంలో.. ఒక ఎకరం తీసుకుని, దాని పక్కనే ఉన్న పదుల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దక్కించుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో ఎవరూ అడిగే పరిస్థితి లేదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలంటే.. పేద కుటుంబాలై ఉండాలి. వారికి కూడా గరిష్ఠంగా ఒకటిన్నర ఎకరా మాత్రమే పంపిణీ చేస్తారు. అయితే ఎమ్మెల్యే కుటుంబీకుల పేర్లతో మాత్రం పట్టాలపై పట్టాలిచ్చేశారు. అత్యంత ధనవంతుల కుటుంబానికి పట్టాలు దక్కాయి.
Dalit couple protest: భూమి లాక్కున్నారు.. వైసీపీ నాయకుల తీరుపై దంపతుల ఆగ్రహం
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం లేబాక రెవెన్యూ గ్రామ పరిధిలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కుటుంబ సభ్యులు 25 మంది పేరిట 122 ఎకరాల ప్రభుత్వ భూములకు డీకేటీ పట్టాలు తీసుకున్నారు. ఇవి కాకుండా వందలాది ఎకరాలను ఆక్రమించుకుని మామిడి, పనస, బొప్పాయి, శ్రీగంధం తోటలను సాగు చేశారు. నందలూరు మండలం, చెన్నయ్యగారిపల్లె, ఈడిగపల్లె, ఎర్రచెరువుపల్లి, చింతలకుంట, టంగుటూరు, నాగిరెడ్డిపల్లె, గట్టుమీదపల్లె, నందలూరు, మదనమోహనపురం, పాచికాలువ కుంట, శేషగారిపల్లె, టీవీ రాచపల్లె, టీవీపురం, కొత్త చాపలవారిపల్లెలో ఇతర నేతలు వందలాది ఎకరాలను దర్జాగా కబ్జా చేశారు. సొంత ఆస్తిలా పాగా వేశారు. గుట్టలను ధ్వంసం చేశారు. కొండల రూపురేఖలను మార్చేశారు.
కర్నూలు వైసీపీ ఆఫీస్.. ఆర్టీసీ స్థలంపై నేతల కన్ను
భారీ యంత్రాలను తెప్పించి భూములను చదును చేశారు. యథేచ్చగా పంటలను సాగు చేశారు. భూముల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చుట్టూ రక్షణ కోసం కంచె వేసుకున్నారు. ఆక్రమిత భూముల్లోకి వెళ్లడానికి అనువుగా రహదారులు ఏర్పాటు చేశారు. గొట్టపు బావులను తవ్వించారు. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు పొందారు. ప్రభుత్వ రాయితీతో బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశారు. నందలూరు మండలంలో ఎమ్మెల్యే మేడా, ఆయన కుటుంబం కనుసన్నల్లోనే అధికార యంత్రాంగమంతా పని చేస్తోందని విపక్ష నాయకులు మండిపడుతున్నారు.
రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం.. లేబాక రెవెన్యూ గ్రామ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమికి డీకేటీ పట్టాలు పొందారు. వీరిలో ఎమ్మెల్యే తల్లి లక్ష్మమ్మ పేరిట 2 ఎకరాలు, సోదరుడు మేడా మధుసూదన్‌రెడ్డి 17.28 ఎకరాలు ఉన్నాయి. ఆయన మరో సోదరుడు, ఎంఆర్‌కేఆర్ నిర్మాణ సంస్థ అధినేత అయిన బడా గుత్తేదారు మేడా రఘునాథరెడ్డి పేరిట 2.50 ఎకరాల భూమిని డీకేటీ పట్టా కింద పొందారు. ఎమ్మెల్యే పినతండ్రి, నందలూరు ఎంపీపీ మేడా భాస్కరరెడ్డి భార్య పద్మజ పేరిట 5.65 ఎకరాలు, కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి 9.41 ఎకరాలు, కుమార్తె విజయ శ్రావణిరెడ్డి పేరిట 7.47 ఎకరాల ప్రభుత్వ భూమిని డీకేటీ పట్టా కింద పొందారు.
'ప్రభుత్వ భూమి కబ్జా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?'
ఎమ్మెల్యే మరో పినతండ్రి మేడా చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు, ఎర్రచెర్లపల్లె సర్పంచి రాజశేఖర్‌రెడ్డి పేరిట 4.94 ఎకరాలు, మరో కుమారుడు విజయశేఖర్‌రెడ్డి (పెద్దబాబు) 2.45, కుమార్తె లక్ష్మీదేవికి 7.59 ఎకరాలు డీకేటీ పట్టా కింద భూముల్ని పొందారు. ఎమ్మెల్యే తాత వెంకట సుబ్బారెడ్డికి ఇద్దరు భార్యలు కాగా.. వారి సంతానమైన చరణ్‌కుమార్‌రెడ్డికి 4 ఎకరాలు, దామోదర్‌రెడ్డికి 2.50 ఎకరాలు, నాగరాజమ్మకు 2.57 ఎకరాలు, నిషాంత్‌రెడ్డి 5.70 ఎకరాలు, నిషాంతి 3.85 ఎకరాలు, పద్మనాభరెడ్డి 2.50, నిషాంత్‌రెడ్డి భార్య రాఘవేశ్వరి పేరిట 1.50 ఎకరాల భూముల్ని కాజేశారు.