అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన సురేశ్ వృత్తిరీత్యా దోబీ పని చేస్తారు. ఇళ్లకు వెళ్లి దుస్తులు సేకరించడం, చాకిరేవుకు తీసుకెళ్లి వాటిని ఉతికి మళ్లీ ఎవరివి వారికి తిరిగి అప్పగిస్తారు. మొత్తం మీద రోజూ పాతిక కిలోమీటర్ల వరకూ తిరగాల్సివస్తుంది. దుస్తుల మూటలు మోస్తూ.. అంతదూరం తిరగలేక ఓ టీవీఎస్ మోపెడ్ కొనుక్కున్నారు సురేశ్. సెంచరీకొట్టిన పెట్రోలు దెబ్బకు.. ఇప్పుడా వాహనాన్ని మూలనపడేసి ఓ ఈగాడిదను నమ్ముకున్నారు.
మోపెడ్ అయితే అప్పోసొప్పో చేసి కొన్నానుగానీ.. అందులో పెట్రోలు పోయించడానికి స్థోమత సరిపోవడంలేదంటున్నారు సురేశ్. రోజూ నాకొచ్చేదే వంద, ఆ వందా పెట్రోల్‌కే వెచ్చిస్తే ఇక నేనేంతినాలి.. భార్యబిడ్డలకేంపెట్టాలి అంటారాయన. అందుకే ఓ గాడిదను కొనేశారు. దాని కోసం జట్కాబండి తయారు చేయించారు. ఇది కూడా చౌకేం కాదంటారు సురేశ్. గాడిద ఖరీదు రూ.16 వేలని, బండి తయారీకి మరో రూ. 10వేలు ఖర్చైందని తెలిపారు.
'సురేశ్ ఆలోచనను తోటిదోబీలూ అభినందిస్తున్నారు. తామూ అలా చేద్దామంటే.. గాడిదల ధరలూ పెరిగిపోయాయంటున్నారు. ప్రభుత్వాలెలాగూ.. పెట్రోలు ధరలు తగ్గించలేవుగానీ గాడిదలైనా కాస్త తక్కువ ధరకు ఇప్పించి పుణ్యంకట్టుకోవాలి'. -రమేశ్, రజకుడు
గాడిద బండిపై సవారీ చేస్తున్న సురేశ్‌ను ప్రజలు వింతగా చూస్తున్నారు. ఐనా అదేం తనకు నామోషీ కాదంటున్నారాయన. పెట్రోలు ఊరికే రాదు కదా అంటూ.. ఎదురు ప్రశ్నేశారు. తన వరకూ రవాణా ఖర్చులు ఆదా అయ్యాయంటూ.. తన పనిచేసుకుంటూ సాగిపోతున్నారు.
ఇవీ చదవండి: