నిబంధనల ప్రకారం తమకు సంబంధంలేని విధులను అప్పగించడం సరికాదంటూ అనంతపురం జిల్లా కదిరిలో వార్డు కార్యదర్శులు ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న కార్యదర్శులు, సిబ్బందికి కొవిడ్ వార్డుల్లో విధులు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కార్యదర్శికి 12 మంది కొవిడ్ పాజిటివ్ బాధితుల ఆక్సిజన్ పల్స్తో పాటు.. బాధితులకు అవసరమైన సేవలందించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
విషయం తెలుసుకున్న వార్డు కార్యదర్శులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్నతాధికారులెవరూ అందుబాటులో లేకపోడంతో… తమ బాధను ఆర్టీవోకు చెప్పుకొనేందుకు కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో నిరనస చేపట్టారు. ఆసుపత్రుల్లో కొవిడ్ పాజిటివ్ విధులు నిర్వహిస్తూనే.. సచివాలయాల్లో తమ విధులను పర్యవేక్షించాలని అధికారులు ఆదేశించడం బాధాకరమన్నారు. తమకు ఏమాత్రం పరిచయంలేని పనులు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు.
తమ ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత విషయంలో పట్టించుకోని అధికారులు… ప్రమాదకరమైన వైరస్ బారిన పడినవారికి సేవలందించాలంటూ విధులు కేటాయించడం సరికాదని అన్నారు. వార్డు కార్యదర్శులు చాలా మంది గర్భవతులు ఉన్నారని… వారి పరిస్థితి ఏంటన్నారు. ఒకవేళ కార్యదర్శులు కొవిడ్ బారినపడి మృతిచెందితే… తమకుటుంబ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: