అనంతపురం జిల్లా హిందూపురం మండలం కొటిపి పంచాయతీకి చెందిన వైకాపా నేత హనుమంత్ రెడ్డి తనపై ఎమ్మెల్సీ ఇక్బాల్ దాడి చేశారని ఆరోపించారు. గ్రామానికి సంబంధించిన పనిని తమకు కాకుండా మరో వ్యక్తికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించినందుకు తనపై దాడికి తెగబడ్డారని వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. బాధితుడు హనుమంతరెడ్డిని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించిన మరో వర్గానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఈ ఘటనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
స్పందించిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్
ఇళ్ల పట్టాల స్థలాన్ని చదును చేసే కాంట్రాక్టు పనులను తనకు ఇవ్వలేదనే హనుమంత్ రెడ్డి తన కార్యాలయానికి వచ్చి ఆవేశంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. ఈ క్రమంలో హనుమంత్ రెడ్డిని బయటికి పంపే ప్రయత్నం చేశామని.. ఆయన తనకు తానే గాయపరిచుకొని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.