Veternary Services Poor And Adequate Staff In Anantapur district: వైసీపీ పాలనలో పశువులకు వైద్యం అనేది దైవాదీనంగా మారింది. అసలు మనుషుల్నే పట్టించుకోం అవో లెక్కా అనే ఆలోచనలో ఉన్నారేమో పాలకులు మూగజీవులు ఏం అడుగుతాయిలే అనే ధైర్యం కాబోలు డాక్టర్ల కొరత వెంటాడుతున్నా సరైన వైద్యం అందక పశువులు ప్రాణాలుపోతున్నా రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి 'కనబడదు-వినబడదు' ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇలా అడుగడుగునా పశువైద్యాన్ని అటకెక్కించారు.
Joint Anantapur District: ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిత్యం వైద్యం చేయాల్సిన పశువైద్యులు, పశు సహాయకుల సంఖ్య తక్కువగా ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పశువులు, గొర్రెలు, మేకలు సుమారు 60 లక్షల వరకు ఉన్నాయి. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ‘పశువుకు ఒక కాంపౌండర్ వైద్యం చేయడం వేరు, ఒక డాక్టర్ వైద్యం చేయడం వేరు’ అని చిలక పలుకులు పలికారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఆ ముచ్చటే మరిచారు. నిర్లక్ష్యం చూపుతూ మూగజీవులను పాలకులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. పాలవెల్లువ పేరుతో సహకార పాడిరంగాన్ని అమూల్‌కు అప్పజెప్పిన జగన్ మరోసారి అధికారంలోకి వస్తే అమూల్‌కు పాలను ఇచ్చే పశువులకు మాత్రమే వైద్యం అంటారేమో.. పశుసంవర్థక శాఖను ఆ సంస్థకే అప్పగిస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుకు పాడి-పంట అనే రెండు కూడా రెండుకళ్లలాంటివి. కరవు, తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో పంటలు చేతికి రాకపోతే పశువులే అన్నదాతకు అండగా ఉంటాయి అని నిపుణులు చాలా సార్లు చెప్పారు. ఉమ్మడి అనంతపురం వంటి కరవు జిల్లాల్లో పాడి అవసరం వేరే చెప్పనక్కర్లేదు. అయితే గత ప్రభుత్వాలు దీన్ని గమనించి పశులకు వైద్యం, పాడి వంటి రంగాన్ని ప్రాధాన్యంగా తీసుకొని అభివృద్ధి చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పాడి రైతులకు పశువైద్యం అనేది అందని ద్రాక్షలా మారింది. పాడి పశువులకు ఏదైనా అనారోగ్యం వస్తే గ్రామాల్లో వైద్యం అందించే పరిస్థితి లేదు. ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఆర్‌బీకేల్లోని (రైతు భరోసా కేెంద్రం) సహాయక సిబ్బందితో సర్దుకోవాలని సర్కారు చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో పాల డెయిరీ యాజమాన్యాలే డాక్టర్లను పెట్టి సేవలందిస్తున్నాయి. పల్నాడు జిల్లా నూజెండ్ల మండల వైద్యుడికి వినుకొండ మండలంలోని పిట్టంబండ బాధ్యతల్ని అప్పగించారు. అంటే ఆయన రెండు మండలాలకు పని చేయాలి. కోనసీమ జిల్లాలతోపాటు చాలాచోట్ల ఇన్‌ఛార్జ్‌లే దిక్కు పశువైద్యశాలకు దిక్కు. సరైన సమయంలో వైద్యం అందక మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Veternary Posts When To Replace: రాష్ట్రంలో 1576 వెటర్నరీ డిస్పెన్సరీలు, 323 పశువైద్యశాలలు, 12 పాలీ క్లినిక్‌లు, 2సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులున్నాయి. వెటర్నరీ కౌన్సిల్ నిబంధనల ప్రకారం..ప్రతి 5వేల యూనిట్లకు ఒక డాక్టర్ చొప్పున 3300 మందికి పైగా పశువైద్యుల్ని నియమించాలి. కానీ, ప్రస్తుతం పనిచేసేది 1610 మంది మాత్రమే వీరిలోనే ఏడీ, డీడీ, జేడీలు కూడా ఉన్నారు. వాస్తవానికి వారు పరిపాలనా పరమైన విధుల్నే నిర్వర్తిస్తారు. క్షేత్రస్థాయిలో వైద్యసేవల్ని అందించే పరిస్థితి లేదు. అయినా వారిని పశువైద్యుల కిందనే చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న 1610 మందికి పైగా ఉన్న సిబ్బందిలో సుమారు 400 మంది అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్లే కాగా మిగిలిన వారు వైద్య సేవలు అందిస్తున్నారు. అంటే మరో 2100 మందికి పైగా వైద్యుల పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా వైద్యుల నియామక ప్రక్రియ భర్తీని పట్టించుకోకుండా తాత్సారం చేస్తోంది. గత ప్రభుత్వాలు పాడి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి దాణా మొదలు పశువుల బీమా వరకు అన్ని విధాలా పాడి రైతుకు అండగా నిలిచాయి. పశువుల ఆరోగ్యం దెబ్బతినకుండా పశు షెడ్ల ఏర్పాటుకు సైతం తెలుగుదేశం ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీ ఇచ్చి పాడి రైతులకు అండగా నిలిచింది. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు ఈ ప్రభుత్వం ఇవ్వని కారణంగా పశుపోషణ భారంగా మారిందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.