Uravakonda Constituency YCP Political fights: నాయకుల ఒంటెత్తు పోకడతో సాధారణ ఎన్నికల్లో ఓడిపోతున్నామంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి.. తన అన్న, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని ఉద్దేశించిన చేసిన వాఖ్యలు కలకలం రేపాయి. శనివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు.
వర్గ విభేదాలతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉపన్యాసాలతో ఒరిగిందేమీ లేదని, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రణాళిక లేకపోవడంతోనే ఓటమి పాలయ్యామని, ఇందుకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కారణం అన్నట్లు మాట్లాడారు.
కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈలలు, చప్పట్లతో ఆయనకు మద్దతు పలికారు. మాజీ ఎమ్మెల్యే అనుచరులు వారి నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇరువర్గాల కార్యకర్తలు వేదిక వైపు దూసుకురావడానికి ప్రయత్నించగా కట్టడి చేయడానికి పోలీసులు అవస్థలు పడ్డారు. రెచ్చగొట్టే మాటలు ఎవరూ వినొద్దంటూ మాజీ ఎమ్మెల్యే చెప్పడానికి ప్రయత్నించారు. అదే సమయంలో మధుసూదన్‌రెడ్డి కూడా మైకు తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలగజేసుకుని ఆయన చేతిలో మైకు తీసుకుని ఇద్దరినీ కూర్చోబెట్టారు. నియోజకవర్గంలో ఎలాంటి వర్గాలు లేవని, తమది కేవలం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వర్గమేనంటూ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి: