అనంతపురం జిల్లా వరదాయినిగా భావించే తుంగభద్ర జలాశయం... నీటి ప్రవాహం లేక వెలవెలబోతోంది. జూన్ తొలి వారంలోనే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పటికీ... పుష్కలంగా వర్షాలు లేనందున తుంగ-భద్ర నదుల్లో ఆశించిన మేర ప్రవాహం లేదు. కర్ణాటక, ఏపీలోని హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కింద తాగు, సాగు అవసరాల కోసం నీటిని పూర్తిగా విడుదల చేయాల్సి వచ్చింది. ఫలితంగా టీబీ డ్యాంలో కేవలం 1.8 టీఎంసీలే మిగిలింది. ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో పలుచోట్ల జలాశయాలు, చెక్ డ్యాంలు పెద్దఎత్తున నిర్మించినందున... దిగువకు ప్రవాహం ప్రశ్నార్థకంగా మారింది. అన్నిచోట్లా నీటిని నిల్వ చేసుకున్న తర్వాతే దిగువకు వదలడం వల్ల ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతోంది.
తుంగభద్ర నీటి ప్రవాహాలు ముందుగానే అంచనా వేసి... కర్ణాటక, ఏపీ అవసరాలకనుగుణంగా కేటాయింపులు చేస్తారు. దీని కోసం సంబంధిత బోర్డు రుతుపవనాల రాకకు ముందు, వర్షాకాలం సీజన్ ముగుస్తున్న సమయంలో 2 రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులతో వేర్వేరుగా సమావేశమై నీటి కేటాయింపులు చేస్తుంది. తాజా అంచనాల ప్రకారం అనంతపురం జిల్లా హెచ్‌ఎల్‌సీకి 25 టీఎంసీలు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించింది. ఎగువన ఉన్న తుంగనదీ పరీవాహక ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు కురిసినందున శివమొగ్గ సమీపంలో గరిష్ట స్థాయిలో 3.5 టీఎంసీల నీటి నిల్వలు ఏర్పడ్డాయి. 3 రోజుల క్రితం 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినప్పటికీ, ప్రవాహం ఎక్కడికక్కడ ఇంకిపోయి హొస్పేట్‌లోని తుంగభద్ర డ్యాం వరకూ నీరు రాలేదు.
అనంతపురం జిల్లాలోని పీఏబీఆర్, ఎంపీఆర్ జలాశయాల ద్వారా జిల్లా వ్యాప్తంగా తాగునీటిని సరఫరా చేయాల్సి ఉన్నందున... తుంగభద్ర జలాశయంలో నీటి చేరికపై ఆందోళన నెలకొంది.