Guntakal railway police arrest most wanted thief: రైళ్లల్లో జరుగుతున్న దొంగతనాలను నివారించడం కోసం గుంతకల్ రైల్వే డివిజన్ ఎస్పీ అనిల్ బాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం.. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు దోచుకెళ్తున్న ఘరానా దొంగను పట్టుకుంది. సినీ ఫక్కీలో రెక్కీ నిర్వహించి మరీ నిందితుడిని అరెస్టు చేసింది.
హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన ఉమేద్ అలీ జీనాధ్ అలీ.. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. దీంతో.. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా.. పక్కా ప్రణాళికతో రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. పక్కా సమాచారంతో గుంతకల్లు రైల్వే పోలీసులు.. ఉమేద్ అలీని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసుకు సంబందించిన వివరాలను గుంతకల్ జీఆర్పీ ఎస్పీ అనిల్ బాబు తెలిపారు. నిందితుడు ఏసీ కోచ్‌లో ప్రయాణం చేస్తూ.. సహ ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసేవాడు. కిటికీలో పక్కన నిద్రపోతున్న ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలు లాకెళ్లడం వంటి దొంగతనాలకు పాల్పడేవాడు. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైల్వే స్టేషన్లల్లో గత మూడేళ్లలో.. 14 చోరీకేసుల్లో మొత్తం 628 గ్రాముల బంగారం దోపిడీకి పాల్పడ్డాడని తెలిపాడు. ప్రత్యేక పోలీస్ బృందం చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేసి, మొత్తం సొమ్మును రికవరీ చేసింది. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులు అందరికీ రివార్డులు అందజేస్తామని ఎస్పీ అనిల్ బాబు ప్రకటించారు.
రైల్వే అధికారుల అలసత్వంపై జీఎంకు ఫిర్యాదు..
దొంగతనాలకు పాల్పడే క్రమంలో.. తన సమాచారం పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పడేవాడు జీనాధ్ అలీ. అందులో భాగంగా.. ప్రయాణం చేసిన ప్రతీసారి ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి, వేర్వేరు పేర్లతో రైలు ప్రయాణం కొనసాగిస్తూ చోరీలకు పాల్పడేవాడు. రైలు ప్రయాణాల్లో నిందితుడు ఉపయోగించిన ఆధార్ కార్డుల తనిఖీల్లో.. అధికారుల లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రైల్వే అధికారుల అలసత్వాన్ని రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇదీ చదవండి..