అనంతపురం జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని తెదేపా సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అనంతపురం జిల్లాలో 12 లక్షల 26 వేల ఎకరాల్లో వేరుశనగ వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని కాలవ శ్రీనివాసులు గుర్తు చేశారు. ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం కోసం 6 లక్షల 97 వేల మంది రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన రూ.2500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనూ తేదేపా ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాడామని గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి రైతులపై కనువిప్పు కలగలేదని అన్నారు.
తెదేపా ఆధ్వర్యంలో ఈనెల 5న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల వద్ద అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు కాలవ శ్రీనివాసులు తెలిపారు. 7న ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసన చేపడతామని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: