TDP Polit Bureau Member Kalva Srinivasulu : ప్రజా ధనంపై వైఎస్సార్సీపీ పెత్తనం ఏంటని మాజీ మంత్రి, టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రచార యావ పిచ్చిగా మారుతోందని విమర్శించారు. ప్రజాధనానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలను ప్రచారకర్తలుగా మారుస్తున్నారని కాల్వ ధ్వజమెత్తారు. లాయర్లకు కోటి రూపాయలు ఖర్చు చేసి.. పబ్లిసిటీ కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు.
ప్రజాధనానికి పార్టీ నాయకులకు సంబంధమేంటని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో.. గృహ సారథులు, కన్వీనర్లు పాల్గొనాలని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వారికి సూచించిందని అన్నారు. ఆ సమయంలో ఫొటోలను తీసి.. వాటిని వారికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని ఆదేశించిందని అన్నారు. అది పార్టీ డబ్బు కాదని.. ప్రజల సొమ్మన్నారు. ప్రజా ధనంపై, పార్టీ పెత్తనమేంటని ప్రశ్నించారు. దీనిని పంపిణీ చేయటానికి గృహసారథులు ఎవరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నందున ఎమ్మెల్యేలు కూడా ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నారన్నారు.
అసమర్థుడికి పదవి వస్తే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి రూపంలో చూస్తున్నామని అన్నారు. దీనిపై రాష్ట్ర గవర్నర్కు తెలుగుదేశం పార్టీ లేఖ రాస్తుందని తెలిపారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా పార్టీని ప్రభుత్వానికి మిళితం చేసి.. పార్టీ పెద్దలను పెత్తనం చేయడానికి ఉసిగోల్పడం సరైనది కాదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు ఇది విరుద్ధమన్నారు. రాష్ట్ర గవర్నర్ దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గవర్నర్ దీనిపై చర్య తీసుకోవాలని కోరారు. ఎవరు అడ్డుకోక పోతే దానిని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని వెల్లడించారు.
ఇవీ చదవండి :