TDP LEADERS REACTS ON ANANTAPUR INCIDENT : అనంతపురంలో వ్యవసాయ కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్నారు. విద్యుత్ తీగలు తెగిపడటం.. వారం రోజుల్లో ఇది రెండోసారని.. కొన్ని రోజుల క్రితం ఈ తరహా ప్రమాదంలో ఐదుగురు చనిపోయారన్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. విద్యుత్ శాఖ పర్యవేక్షణ కరువయ్యిందని ధ్వజమెత్తారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు. ప్రమాద ఘటనలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రమాదాలు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది: రాష్ట్రంలో వరుసగా విద్యుత్ తీగలు ఎందుకు తెగిపడుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. ప్రజల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలు తెగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని మండిపడ్డారు. అనంతపురంలో విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు చనిపోవడం, పలువురు పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరమన్నారు. ప్రమాదం జరిగిన ప్రతిసారీ ఉడత కథ చెప్పి తప్పించుకోవడం, దేవుడి ఖాతాలో వేసి చేతులు దులుపుకోవడం జగన్ సర్కార్‌కి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. చనిపోయిన కూలీల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు.
ప్రమాదాలపై ప్రభుత్వం చోద్యం : అనంతపురం జిల్లా దర్గాహోన్నూరులో విద్యుత్ తీగలు తెగి నలుగురు కూలీలు మృతి చెందడంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమాదాలు తరుచూ జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీలు పెంచటంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను రక్షించడంపై లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. మరణించిన కూలీల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి : అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు పడి వ్యవసాయ కూలీలు మరణించడం బాధాకరమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ ఘటనకి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని అన్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.2 రెండు లక్షలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరుస విద్యుత్ ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు పోతున్నా సీఎం ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు.
ఇవీ చదవండి: