మంచానికే పరిమితమైన ఈ యువతి పేరు సువర్ణ. అనంతపురం జిల్లా ధర్మవరం యాదవ వీధిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఏడేళ్ల కిందటి వరకు ఎంతో సంతోషంగా ఉంటున్న ఈ కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. సువర్ణకు క్రమంగా శరీరం వాపు మొదలైంది. ఉన్నంతలో తల్లిదండ్రులు... హైదరాబాద్, బెంగళూరులోని ఆసుపత్రుల్లో చూపించారు. కండరాలకు సంబంధించిన వ్యాధిగా నిర్థరించిన వైద్యులు ... చికిత్సకు 3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. దాతలు ముందుకొచ్చి సువర్ణ వైద్యానికి ఆ ధనాన్ని సమకూర్చారు. బెంగళూరులోని ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో....ఆమె తండ్రి సైకిల్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడ్డారు. తలకు తీవ్ర గాయమై ...రక్తం గడ్డకట్టింది. సువర్ణ వైద్యం కోసం సమకూర్చిన డబ్బును కుటుంబ సభ్యులు....ఆమె తండ్రి శస్త్రచికిత్స కోసం ఖర్చు చేశారు. పూర్తిగా నయం కాకపోవడం వల్ల తండ్రికి రెండోసారీ ఆపరేషన్ చేశారు. చేతిలో ఉన్న డబ్బు కరిగిపోయి...సువర్ణకు సకాలంలో చికిత్స అందక వ్యాధి ముదిరిపోయింది. అప్పటి నుంచి ఆ యువతి ప్రతి రోజూ నరకం అనుభవిస్తోంది.
పోషణ కోసం సొంత ఇల్లూ అమ్మకం
ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న సువర్ణ తండ్రికి శస్త్రచికిత్సలతో సమస్య పరిష్కారమైందని ఆ కుటుంబం కాస్త ఊరట చెందుతుండగా...ఈలోపే ఆమె తల్లి విజయలక్ష్మికి వెన్నెముక శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. చికిత్స సమయంలో జరిగిన పొరపాటు వల్ల ...వెన్నెముక వంగకుండా పోయింది. ముదురుతున్న తన జబ్బుతో బాధను అనుభవిస్తూనే... భర్త, కుమార్తెకు సేవలందిస్తోందామె. వైద్య ఖర్చులు, కుటుంబ పోషణకు ఉన్న ఇల్లునూ అమ్ముకోవల్సి వచ్చింది. ప్రస్తుతం సువర్ణ పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రతి నెలా 6 వేల రూపాయల మందులు వాడితేనే కనీసం కూర్చొనేందుకు శరీరం సహకరిస్తుందని సువర్ణ వాపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమను ఏదైనా ఆశ్రమంలో చేర్చి ఆదుకోవాలని సువర్ణ కుటుంబం కన్నీటితో వేడుకుంటోంది.
సహాయం చేస్తున్న ఏకత్వ సేవా సంస్థ
సువర్ణ కుటుంబం బాధలు తెలుసుకున్న అనంతపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల మిత్ర బృందం ప్రతి నెలా కొంత సాయం చేస్తోంది. దీపావళి రోజున 80వేల ఆర్థిక సాయాన్ని వారికి అందించారు. తమతో పాటు మరింత మంది దాతలు ముందుకు వస్తే...సువర్ణతో పాటు ఆమె తలిదండ్రుల వ్యాధులకు కొంత పరిష్కారం చూపవచ్చని ఏకత్వ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సువర్ణ కండరాల వ్యాధికి వైద్యం చేయాల్సిన సమయం దాటిపోయినందున..కనీసం వారిని ఆదరించి,అక్కున చేర్చుకోనేందుకు సేవా సంస్థలు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.