అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శివుని పర్వదినాన గర్భగుడిలోని స్వామివారిని ప్రభాత కిరణాలు తాకాయి. రథసప్తమి తర్వాత మళ్లీ ఈ రోజు సూర్యకిరణాలు లింగేశ్వరుడిని స్పృశించాయని ఆలయ పూజారి తెలిపారు. ఈ అరుదైన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భానుడి కాంతి ముందుగా స్వామి వారి పాదాలను తాకి.. మెల్లగా శిరస్సును చేరింది. ఏకంగా పది, పదిహేను నిమిషాల పాటు రవి కిరణాలు స్వామి వారి మూలవిరాట్టును తాకాయి.
రాయదుర్గం
పట్టణంలో ప్రసిద్ధి చెందిన స్వయంభు శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి పవిత్ర జలాలతో గంగ పూజ, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, పుష్పాలంకరణ, మహా మంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా జనం తరలివచ్చారు. అర్చన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: గుడివాడలో మహా శివరాత్రి వేడుక.. ముఖ్యమంత్రి జగన్ పూజలు