ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సందడి చేస్తుండగా.. అనంతపురంలో మాత్రం విషాదం చోటు చేసుకుంది. ఉదయం జిల్లా కేంద్రంలోని ఎస్వీ థియేటర్లో సినిమా చూస్తూనే ఓ అభిమాని కుప్పకూలిన ఘటన మరువక ముందే మరో అభిమాని మృతి చెందాడు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మారెమ్మ గుడి వీధిలో శంకర్ (18) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు వెళ్లొచ్చి.. పడుకున్న శంకర్‌ను తండ్రి మైలారప్ప మందలించాడు. అనంతరం మైలారప్ప కూలిపనికి వెళ్లాడు. తండ్రి తిట్టటంతో.. మనస్తాపానికి గురైన శంకర్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కూలి పనులకు వెళ్లొచ్చిన మైలారప్ప ఇంటికి వచ్చి చూడగా.. విగతజీవిగా వేలాడుతున్న కొడుకు చూసి కేకలు వేశాడు. అనంతరం శంకర్‌ను ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: RRR సినిమా చూస్తూనే.. కుప్పకూలిన అభిమాని!