కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన తర్వాత కూడా.. జిల్లాల కోసం నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు జిల్లా కేంద్రం ప్రకటించలేదంటూ పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రతులకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.
హిందూపురం: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హిందూపురంలో నల్లజెండాలతో అఖిలపక్ష నాయకులు నిరసన తెలిపారు. అంబేద్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని రకాలుగా అర్హతలు కలిగి ఉన్న హిందూపురాన్ని కాదని.. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించడం సరికాదన్నారు. సత్యసాయి జిల్లా గెజిట్ నోటిఫికేషన్ ప్రతులకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు.
మాచవరం: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే.. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ మాచవరంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాచవరం బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు చరిత్రతో సంబంధం లేని నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయటంపై.. అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌ను పట్టించుకోలేదని విమర్శించారు.
అమలాపురం: అమలాపురం కలెక్టరేట్ ఎదుట అంబేడ్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.
మార్కాపురం: ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చెందని మార్కాపురాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వానికి.. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గత అరవై రోజులుగా జిల్లా కోసం ఉద్యమం చేసినా.. కనీసం తమ మొర ఆలకించిన పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు. మార్కాపురాన్ని జిల్లా చేయకపోవడాన్ని నిరసిస్తూ పట్టణంలో ఐకాస ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి తన స్వార్ధ రాజకీయం కోసం తమ ప్రాంత ప్రజలను బలిపశువులను చేశారని ఐకాస నాయకులు ఆరోపించారు.
ఇదీ చదవండి: Agriculture: రైతులకు అందని సాయం.. ఏటికేడు నిధుల్లో కోత