కర్ణాటకలోని హోస్పేటలో గల తుంగభద్ర జలాశయం వరద నీటితో పూర్తిస్థాయిలో నిండింది. డ్యాం వరద నీటితో నిండు కుండలా మారింది. దీంతో తుంగభద్ర బోర్డు అధికారులు మూడు గేట్ల ద్వారా ఆదివారం రాత్రి 7 గంటలకు నీటిని తుంగభద్ర నదిలోకి వదిలారు. టీబీ డ్యాం లోకి వరద నీరు వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా సోమవారం ఉదయం నీటి విడుదలకు అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. నది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633.00 అడుగులు కాగా, ప్రస్తుతం వరద నీటితో పూర్తిస్థాయిలో నిండింది. డ్యాం నీటి సామార్థ్యం 100.855 టీఎంసీలు కాగా ఇప్పటికే 100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. టీబీ డ్యాంలోకి న్ఫ్లో 30516 క్యూసెక్కులు రాగా,..అవుట్ ఫ్లో 8363 క్యూసెక్కులుగా ఉంది. కర్ణాటకలోని మంగళూరు, శివమొగ్గ, ఆగుంబె ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో తుంగభద్ర జలాశయంకు గత కొద్ది రోజులుగా ఇన్ఫ్లో భారీగా పెరిగింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. వరదనీరు టీబీ డ్యాం లోకి రావడంతో తుంగభద్ర బోర్డ్ ఎస్సీ వెంకటరమణ, అధికారులతో కలిసి గేట్ల ద్వారా నీటిని నదిలోకి వదిలారు. తుంగభద్ర జలాశయం పూర్తిగా వరద నీటితో నిండడం తో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలైన అనంతపురం , కడప, కర్నూల్ ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీరనున్నాయి. హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి. 'అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలి'