Police Attack Software Employee in Anantapur: ఎవరిని అయినా నిందితుడిని పట్టుకోవాలి అనుకుంటే పోలీసులు పక్కా ప్లాన్ వేస్తారు. లొకేషన్ ట్రాక్ చేసి మరీ.. నిఘా పెడతారు. కానీ ఆ లొకేషనే వారి కొంప ముంచింది. ఒకరిని వెతికే క్రమంలో మరో వ్యక్తి అయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి చేశారు. పోలీసుల దాడిలో సదరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం కాస్తా బయటక రావడంతో.. తప్పైంది.. చింతిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.
ఓ కేసులో నిందితుడిని వెతికే క్రమంలో పొరపడిన అనంతపురం సెబ్ పోలీసులు.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై ప్రతాపం చూపారు. ఆయనపై కాపు కాచి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన పోలీసులు అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. జేఎన్టీయూ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
ఆర్మీ జవాన్‌పై పోలీసుల అరాచకం - నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా మూకుమ్మడి దాడి
ఇంతకీ అసలు విషయం ఏంటంటే..: నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి.. రోజూ ఉదయపు నడకకు జేఎన్టీయూ మైదానానికి వెళుతుంటారు. మంగళవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా ఇద్దరు అమాంతం మీదపడి గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. వచ్చినవారు దొంగలుగా భావించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు.. ఆ ఇద్దరిపై ఎదురుదాడి చేస్తూ ఒకరిని గట్టిగా కొరికారు.
ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి చేసి బలంగా పక్కకు తోశారు. బాధితుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి చేసింది తాడిపత్రి సెబ్ పోలీసులేనని తెలిసింది.
అతడిని ఎలా అయినా పట్టుకోవాలని: తాడిపత్రికి చెందిన రామాంజనేయరెడ్డి అనంతపురంలో ఉంటూ గోవా మద్యాన్ని సరఫరా చేస్తుంటాడు. రామాంజనేయరెడ్డి నుంచి మద్యం కొన్న ఓ నిందితుడు ఇటీవల తాడిపత్రి సెబ్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో రామాంజనేయరెడ్డి వివరాలు తెలియడంతో.. అతడిని ఎలా అయినా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫోన్ నంబరుతో లొకేషన్ గుర్తించి పట్టుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా పరిశీలించగా.. ఫోన్ లోకేషన్ మంగళవారం JNTU మైదానంలో ఉన్నట్లు సూచించింది.
లొకేషన్ తప్పుగా చూపించడంతో: దీన్ని బట్టి మైదానానికి చేరుకున్న ఇద్దరు సెబ్ కానిస్టేబుళ్లు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డిని చూసి రామాంజనేయరెడ్డిగా భావించి గట్టిగా అదిమి పట్టుకుని దాడి చేశారు. బాధితుడికి తీవ్రంగా గాయాలవడం చూసి భయపడిన కానిస్టేబుళ్లు.. అక్కడినుంచి పరారయ్యారు. గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. లొకేషన్ తప్పుగా చూపించడంతో గందరగోళానికి గురై తప్పిదం జరిగిందని సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనకు చింతిస్తున్నామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Kinjarapu Atchannaidu about Police Attack on Software Employee: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై పోలీసుల దాడి దారుణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎవరో తెలియకుండా కొట్టడం సెబ్ పనితీరుకు అద్దం పడుతోందని.. గాయపడిన చంద్రశేఖర్‌రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధ్యులైన సెబ్ పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Police Attack on Husband Wife Suicide Attempt: భర్తపై పోలీసుల దాడి.. మనస్థాపంతో భార్య ఆత్మహత్యాయత్నం