Lack of Facilities in Super Specialty Hospital: అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు నరకం అనుభవిస్తున్నారు. ఐసీయూలో రోగులు ఉక్కపోత భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ బాధలు భరించలేమంటూ రోగులే ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకొని ఐసీయూ వార్డులో ఉంచుతున్నారు. కోట్లు వెచ్చించి నిర్మించిన ఆసుపత్రిలో కనీస వసతులు కల్పించడంలో అధికారుల వైఫల్యం చెందారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్లో.. కార్డియాలజీ ఐసీయూలో 10 మంది, న్యూరో సర్జరీ ఐసీయూలో ఆరుగురు, నెప్రాలజీ ఐసీయూ విభాగంలో 9 మంది చికిత్స పొందుతున్నారు. గత నెల రోజులుగా ఆ ఆస్పత్రిలో ఏసీలు పని చేయడం లేదు. దీంతో రోగుల సహాయకులు రూ.1000 నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేసి ఫ్యాన్లను సొంతంగా తెచ్చుకున్నారు. వీటిని కొనుగోలు చేసుకోలేని వారు అలానే ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు.
రాయలసీమ ప్రాంతానికి తలమానికంగా ఉండేలా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. అయితే ఇందులో వైద్యులు, సిబ్బంది కొరత ఉండటంతో పాటు ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన సౌకర్యాలు కూడా లేవు. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వళ్తే కనీసం ఏసీలు కూడా లేని దుస్థితి ఆసుపత్రిలో నెలకొంది. ఆసుపత్రిలోని పరిస్థితులను చూసి కొంతమంది రోగులు ప్రైవేటు వైద్యశాలలకు వెళుతున్నారు. అయితే ఈ ఆస్పత్రిలోనే ఉండే సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సూపర్ స్పెషాలిటీ అని చెబుతున్న అధికారులు ఇక్కడ మాత్రం వసతుల కల్పనలో వైఫల్యం చెందారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని రోగులకు సరైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
" గుండె సంబంధిత సమస్యతో నేను ఈ హాస్పిటల్లో చేరాను. అయితే ఈ ఆస్పత్రిలో ఒక్క ఫ్యాన్ కూడా లేదు. దీంతో మేమే మా ఇంటి నుంచి ఫ్యాన్ తీసుకుని వచ్చి వేసుకుంటున్నాము. అయితే ఆ ఫ్యాన్‌కు కూడా వైర్ ఊడిపోయి పని చేయట్లేదు. దీంతో రాత్రంతా ఉక్కపోతతో అవస్థలు పడ్డాము. నాతో పాటు పేషెంట్స్ అందరూ రాత్రంతా మేలుకునే ఉన్నారు. ఇలా ఆస్పత్రిలో తగిన సౌకర్యాలు లేకపోవటంతో మేము నరకం అనుభవిస్తున్నాము. - చౌడమ్మ, పేషెంట్
"పేరుకే ఇది సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ కానీ ఇక్కడికి వస్తున్న పేషెంట్లకు సరైన సౌకర్యాలు లేవు. ఈ ఆస్పత్రిలో ఏసీలు పని చేయటం లేదు. దీంతో ఇక్కడికి వచ్చే రోగులే ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని ఈ హాస్పిటల్‌కు వచ్చే రోగులకు తగిన మౌలిక సదుపాయాలు అందించాలని కోరుకుంటున్నాము." - గంగాద్రి, పేషెంట్ బంధువు