పోలింగ్ సమయం దగ్గరపడుతున్నందున రాప్తాడు తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. తన తల్లి పరిటాల సునీతతో కలిసి నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల, బండమీదపల్లిలో శుక్రవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. వెళ్లిన ప్రతిచోట పూలవర్షం కురిపిస్తూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బండమీదపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించిన పరిటాల శ్రీరామ్... ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పేదలకు ఏ లోటు రానీయకుండా సీఎం చంద్రబాబు పంచిన సంక్షేమ పథకాలు నిరుపేదల ముఖాల్లో కళ తెచ్చాయన్నారు. చెరువులను కృష్ణా నీటితో నింపడం వల్లనే గొర్రెల మందల పెంపకం వృత్తి వదిలేసిన వారంతా మళ్లీ మందపెట్టుకొని జీవనోపాధి వృద్ధి చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. 2నిమిషాలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.ప్రతిపక్ష పార్టీలు నవరత్నాల పేరుతో చేస్తున్న ప్రచారం వట్టి బూటకమని మంత్రి పరిటాల సునీత విమర్శించారు. తాము ఐదేళ్ల కాలంలో రోడ్ల నిర్మాణం మొదలు తాగునీరు, పింఛన్లతో పాటు, మహిళలకు ఆర్థికంగా ఆదుకునే చంద్రన్న పసుపు కుంకుమ పథకాలు అమలు చేశారమని చెప్పారు.