అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. వరి, మిరప, వేరుశనగ తదితర పంటలు నీటిపాలయ్యాయి. విడపనకల్లు, ఉరవకొండ మండలాల్లో దాదాపు 1000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తమ కష్టమంతా కళ్లెదుటే తుడిచిపెట్టుకుపోతుంటే రైతులు లబోదిబోమంటున్నారు.
అయితే అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజుల నుంచి ఉరవకొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అదే సమయంలో కాలువలు, వంకల కింద సాగు చేసే రైతుల పంటల మీద నీరు ప్రవహించటంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. రాయంపల్లి, పి. మల్లాపురం గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో వరి నీట మునిగింది. 200 ఎకరాల్లో మిరప కొట్టుకుపోయింది. బుధగవి గ్రామంలో వేరుశనగ పంట దెబ్బతింది. వీటితో పాటు పత్తి తదితర పంటలు కూడా దెబ్బతిన్నాయి.
రైతులకు ఆదిలోనే ఈ వర్షాలు ఆశనిపాతం అయ్యాయి. ఇప్పటికే పనికిరాకుండా ఉన్న వరిని తొలగించి మరోసారి వరినాట్లు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు. నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు పర్యటించి ప్రభుత్వం ద్వారా తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇదీ చదవండి