Minister Usha Sri Charan : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి ఆనుకుని ఉన్న కురాకులతోటలో జగనన్న లే-అవుట్‌కు గతంలో కొంత భూమి సేకరించారు. పట్టణానికి చెందిన లబ్ధిదారులకు పట్టాలిచ్చి ఇళ్లను నిర్మిస్తున్నారు. ఈ లే-అవుట్‌కు ఆనుకుని ఉన్న మరో ఐదెకరాలను సేకరించాలని అధికారులు ఇటీవల నిర్ణయించారు. కురాకులతోట పరిధిలోని సర్వే నంబరు 232-1లో గల 1.40 ఎకరాలు, 232-2లోఉన్న 2.64 ఎకరాలు, 248-2లోని 0.96 ఎకరాలు మొత్తం ఐదెకరాల భూమిని గుర్తించారు .
ఈ స్థలంలో ఎకరాకు 35 లక్షల రూపాయల పరిహారమివ్వాలని రైతులు కోరుతున్నట్లు.. గతేడాది సెప్టెంబరులో తహశీల్దారు జిల్లా కలెక్టర్‌కు పంపిన ప్రతిపాదనల్లో విన్నవించారు . భూసేకరణకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం జిల్లా కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తహశీల్దారు ప్రతిపాదనలు ఆమోదించేలా మంత్రి ఉషశ్రీ చరణ్.. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంత్రి అనుచరులు రైతులతో మాట్లాడి, ఎకరాకు 35 లక్షల రూపాయలు ఇప్పించేలా పావులు కదిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరిహారం అందాక ఎకరాకు 15 లక్షల రూపాయలు కమీషన్ రూపంలో ఇచ్చేలా బాధిత రైతులతో ఒప్పందాలను కుదుర్చుకున్నారు. పరిహారం తీసుకున్నాక కమీషన్ ఇస్తారో లేదో అన్న అనుమానంతో.. ముగ్గురు రైతులతో మంత్రి భర్త శ్రీచరణ్ రెండెకరాల భూమిని తన డ్రైవర్ గురురాజ్ పేరుతో రాయించుకున్నారనే విమర్శలున్నాయి.
మంత్రి ఉష శ్రీచరణ్, ఆమె భర్త చరణ్ భూ కుంభకోణాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు.
"కళ్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ పాల్పడుతున్న భూ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు నిర్వహించి అక్రమాలను వెలికితీయాలి. మంత్రి బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా కళ్యాణదుర్గంలో వేస్తున్న లే అవుట్లలో మంత్రి వాటా ఎంత." -ఉమామహేశ్వర నాయుడు, టీడీపీ నేత
తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి కించపరిచే విధంగా పత్రికల్లో రాసి, అవినీతి ఆరోపణ చేస్తున్న వారిని కోర్టుకు రప్పిస్తానని.. మంత్రి ఉషశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా ఆస్తులు కొనుగోలు చేయడం తప్పా, మా అనుచరులు ఎవరూ ఆస్తులు కొనుగోలు చేయకూడదా అని ప్రశ్నించారు.
"ఒక మహిళ నేత ఎదుగుదలను చూసి ఓర్వలేక స్థానిక నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా పేరు మీద లేని సర్వే నెంబర్లను ఎలా పత్రికలలో రాస్తారు. "-ఉష శ్రీచరణ్, మంత్రి
2020లో సదరు జగనన్న కాలనీ లే-అవట్ కోసం ఎకరాకు 25 లక్షల రూపాయలిచ్చామని ప్రస్తావించారు. దీన్నిబట్టి రెండేళ్ల కిందట రైతులకు వచ్చిన పరిహారం నుంచి అధికార పార్టీ నాయకులు భారీగా కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: