అనంతపురం జిల్లా రాయదుర్గం మండల సమీపంలో వెలసిన మద్దానేశ్వరస్వామి రథోత్సవం భక్త జన సందోహం నడుమ వైభవంగా సాగింది. ప్రతి ఏడాది శివరాత్రి అనంతరం స్వామివారి రథోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మేళతాళాలు, డప్పులతో, నంది కోళ్ల సడులతో స్వామి వారి మూలవిరాట్టును ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు స్వామి వారిని శివనామస్మరణతో పూలతో అలంకరించి పూజలు చేశారు.
ఓం నమశ్శివాయ అంటూ పంచాక్షరి మంత్రము జపిస్తూ భక్తులు మద్దానేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి బసవన్న కట్ట వరకు రథాన్ని లాగారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న సంతర్పణ కార్యక్రమాలు చేపట్టారు. రథోత్సవంలో రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అగ్నిగుండ మహోత్సవానికి పోటెత్తిన భక్తులు