అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా టౌన్ మానిటరింగ్ కో ఆర్డినేటర్ తీరుపై మహిళా సంఘాల ఆర్పీలు ఆందోళనకు దిగారు. టీఎంసీ శ్రీనివాసరెడ్డి ఆర్పీల మధ్య గొడవలు సృష్టించి, ఘర్షణ పడేలా చేస్తున్నారంటూ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. టీఎంసీ శ్రీనివాసరెడ్డి కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. మిగతావారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. నచ్చని వారిపై వ్యతిరేకంగా నివేదికలు సిద్ధం చేసి వారిని తొలగించేందుకు సిద్దమవుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు.
టీఎంసీ వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్పీ సోదరి రషీదా టీఎంసీతో వాగ్వాదానికి దిగారు. తన చెల్లెలకు ఏదైనా జరిగితే అందుకు శ్రీనివాసరెడ్డి కారణమని ఆరోపిస్తూ కార్యాలయం ఎదుట దీక్ష చేశారు. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై టీఎంసీ శ్రీనివాసరెడ్డి స్పందించారు. తనకు గొడవలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల మేరకు పదో తరగతి సర్టిఫికెట్ ఇవ్వని ఆరుగురు ఆర్పీలను తొలగిస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి..