ఫోర్జరీ, ఎన్ఓసీలతో వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారన్న కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు హైదరబాదులో అరెస్టు చేశారు. అనంతపురం నుంచి ప్రత్యేక పోలీసులు బృందం హైదరాబాద్ వెళ్లి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. జిల్లా ఏఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన డీఎస్పీలు ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని వేర్వేరుగా విచారిస్తున్నారు. మరో పోలీసు బృందం ఆర్టీఏ అధికారుల సహాయంతో వాహన చట్టం ప్రకారం అవసరమైన సెక్షన్లు నమోదు చేస్తూ.. కోర్టుకు సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నారు.
అరెస్టు విషయం తెలుసుకున్న జేసీ సోదరుల అనుచరులు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు యత్నించారు. స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తుండగా..పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆందోళనకారులను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫోర్జరీ ఎన్ఓసీలతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారున్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.