అనంతపురం జిల్లాలో నిబంధనలకు విరద్ధంగా గనుల శాఖ అధికారులు అనుమతులు జారీ చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిపే గనుల క్వారీలపై కేసులున్నా తెరచుకున్నాయి.
● జిల్లాలో వివాదాస్పద ఓబుళాపురం ఇనుప ఖనిజ గనుల్లో దశాబ్దం కిందట పెద్దఎత్తున అక్రమాలు జరగడంతో సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆ ప్రాంతంలో ఉన్న ఇతర లీజులకు కూడా అధికారులు అప్పటి నుంచి అనుమతులు జారీ చేయడం లేదు. ఆ ప్రాంతంలో ఓ లీజుదారునికి అనంతపురంలోని గనుల శాఖ అధికారులు నెల కిందట అనుమతులు జారీ చేశారు. దీంతో యథేచ్ఛగా ఖనిజాన్ని తరలిస్తున్నారు.
● జిల్లా కేంద్రానికి దగ్గరలోని ఓ గ్రామం వద్ద 20కి పైగా రహదారి కంకర (రోడ్ మెటల్) క్వారీలు ఉన్నాయి. వాటిలో కొన్ని అక్రమ తవ్వకాలు, రవాణా చేస్తున్నారనే కారణంతో అధికారులు కేసులు పెట్టి, అపరాధ రుసుం విధించి క్వారీలను సీజ్ చేశారు. లీజుదారుడు అన్ని అనుమతులు పొందిన తర్వాతే మళ్లీ క్వారీల్లో తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. వాటికీ ఇటీవల అనుమతులు వచ్చేశాయి.
● ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో గనుల నిఘా అధికారులు ‘మహాచెక్’ పేరుతో అనంతపురం ఏడీ పరిధిలోని 34 గ్రానైట్, కంకర క్వారీలపై దాడులు నిర్వహించారు. పొందిన లీజు కంటే హద్దులు దాటి తవ్వకాలు జరిపినట్లు, రాయల్టీ చెల్లింపులు సక్రమంగా లేవని గుర్తించారు. దీంతో ఆ క్వారీలపై కేసులు నమోదు చేసి, రూ.59.32 కోట్ల అపరాధ రుసుం విధించారు. కేసులున్నా.. వీటిలో కొన్ని క్వారీలకు అధికారులు అనుమతులిచ్చినట్లు తెలిసింది.
● బిల్డింగ్ కంకర, క్యూబ్స్, డోలమైట్, స్టియటైట్, ఇనుముతో కలిపి మొత్తం 107 క్వారీలు పని చేయడం లేదు. కేసులున్నా.. ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా క్వారీల యజమానులు అనుమతులు పొందుతున్నారు.
నిబంధనలు ఇలా...
క్వారీల్లో తవ్వి తీసిన ఖనిజాన్ని లీజుదారులు తరలించాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో ఆటో పర్మిట్లకు దరఖాస్తు చేసుకోవాలి. లీజుదారు దరఖాస్తు మేరకు ఏడీ స్థాయి అధికారితో తనిఖీ చేయించాలి. సాంకేతిక సహాయక లేదా రాయల్టీ అధికారులు క్వారీలకు వెళ్లి అసలైన లీజుప్రాంతం నుంచి ఖనిజాన్ని తవ్వుతున్నారా? లేదా? ఎంత మేర తవ్వారు? అనే అంశాలను పరిశీలిస్తారు. తవ్విన ఖనిజాన్ని క్యూబిక్ మీటర్లు లేదా టన్నుల్లో కొలుస్తారు. తనిఖీ చేసిన నివేదిక అనుసరించి అధికారులు అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కొత్త నిబంధన ప్రకారం విజిలెన్సు, మైనింగ్, ఇతర ఉన్నత సంస్థలు సీజ్ చేసిన ఖనిజాన్ని, పర్యావరణ అనుమతులు(ఈసీ) లేని క్వారీలకు ఎలాంటి అనుమతి ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
వివాదాస్పద క్వారీలకూ...
2015లో మడకశిర నియోజకవర్గంలోని ఓ క్వారీ నుంచి గ్రానైట్ రాయిని లారీలో తరలిస్తుండగా.. పెనుకొండ వద్ద ఆ రాయి రైలు పెట్టెలోకి దూసుకెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన కొద్ది రోజులకే సదరు క్వారీని గనుల అధికారులు సీజ్ చేసి, రూ.4 కోట్లకు పైగా పెనాల్టీ విధించారు. లీజుదారుడు ఎలాంటి పెనాల్టీ చెల్లించకపోగా, ప్రస్తుతం అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
●అమడగూరులో ఓ క్వారీలో పరిధిని మించి తవ్వకాలు జరపడం, రాయల్టీ లేకండా పెద్దఎత్తున గ్రానైట్‌ను తరలించడంతో రూ.4కోట్లు అపరాధ రుసుం వేశారు. రుసుం చెల్లించకుండానే అధికారులను ఒప్పించి పర్మిట్లు పొందినట్లు సమాచారం.
పాత కేసులన్నీ హుష్!
జిల్లాలో రెండు నెలలుగా అనుమతులకు రెక్కలొచ్చాయి. కేసులు, అపరాధ రుసుం చెల్లించని క్వారీలకు సైతం మంజూరు చేస్తున్నట్లు తెలిసింది. ఐదేళ్లలో సుమారు రూ.100కోట్లకు పైగా అపరాధ రుసుం విధించారు. అందులో వసూలైంది అంతంత మాత్రమే. కర్ణాటక సరిహద్దు మండలాల క్వారీల్లో గ్రానైట్‌కు నాలుగైదు బ్లాకులకు అనుమతులు తీసుకుంటున్నారు. ఒకే పర్మిట్ మీద మూడు నుంచి నాలుగు సార్లు ఖనిజాన్ని రవాణా చేస్తున్నారు. అనంతపురం గ్రామీణం, సమీప మండలాల్లో ఉన్న 15 కంకర క్వారీలపై కేసులున్నా తవ్వకాలకు, రవాణాకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది.
జరుగుతున్నది ఇదీ...
లీజుదారులు ఖనిజం తవ్విన తర్వాత ఆన్‌లైన్‌లో పర్మిట్ల (ట్రాన్సిట్)కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అదికూడా తక్కువ ఖనిజానికి అనుమతి కోరుతూ. క్వారీల్లో ఎలాంటి పరిశీలన లేకుండానే అధికారులు పర్మిట్లు జారీ చేస్తున్నారు. దీంతో ఇష్టానుసారంగా ఖనిజాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఇలాంటివే జరుగుతున్నాయి. ప్రధానంగా కర్ణాటక సరిహద్దులోని అగళి, మడకశిర, అమడగూరు, అమరాపురం, చిలమత్తూరు, డి.హీరేహాల్, బొమ్మనహాల్ మండలాల నుంచి గ్రానైట్, రోడ్‌మెటల్ పెద్ద ఎత్తున తరలిపోతోంది. సరిహద్దుల్లో క్వారీలు ఉన్నవారు గ్రానైట్ బ్లాకులకు తక్కువ పర్మిట్లు తీసుకుని, అధికంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇక్కడ అధికారుల నుంచి ఎలాంటి నిఘాలేక పోవడంతో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
అక్రమ క్వారీపై దాడి
కంకర తవ్వకాల క్వారీపై గనుల శాఖ అధికారులు మంగళవారం దాడిచేశారు. గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామం సర్వే నెంబరు 372లో ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ తవ్వకాలు జరుపుతున్నారు. వీటికి గనుల శాఖ నుంచి ఎలాంటి అనుతులు లేని విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో గనులు, భూగర్భశాఖ జిల్లా డీడీ ఎస్వీ రమణారావు, తాడిపత్రి ఏడీ ఆదినారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విచారణ చేయిస్తాం..
అనుమతులు జారీ చేసే అంశం నా దృష్టికి రాలేదు. క్వారీలపై కేసులు నమోదైతే, ఆ క్వారీ గుర్తింపు సంఖ్య ఆన్‌లైన్‌లో బ్లాక్ అవుతుంది. వాటికి అనుమతులు రావు. అయినా వీటిపై పూర్తి విచారణ చేయిస్తాం. పర్మిట్లు జారీ అవుతున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. - డాక్డర్ ఎస్వీ రమణారావు, డీడీ, గనులు, భూగర్భశాఖ
పూర్తి వివరాలు
ఇదీ చదవండి: ఉరవకొండలో వైకాపా నాయకుడు, కార్యకర్త మధ్య ఘర్షణ