అనంతపురం జిల్లాలో వేరుశనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. నవంబర్ 25 నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి బొత్స సత్యనారాయణ హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. వేరుశనగ రైతులందరి నుంచి పంట కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తాజాగా ఈ-క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతుల పంటనే కొనుగోలు చేస్తామని ప్రకటించింది.
ఈ ఏడాది వేరుశనగ పంట రైతులకు వాతావరణం కాస్త అనుకూలించినా.. విక్రయించటంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దళారులకు అమ్మలేక... మార్కెట్ల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు 5వేల90 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వేరుశనగను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని చెప్పింది. ఈ బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫెడ్ సంస్థకు అప్పగించింది. నవంబర్ 25 నుంచే వేరుశనగను కొనుగోలు చేస్తామని అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు.
ఆయిల్ ఫెడ్ సంస్థకు రైతుల నుంచి వేరుశనగను కొనుగోలు చేసే సామర్థ్యం లేదు. సిబ్బంది కొరతతో కేంద్రాలను ఏర్పాటు చేయటంలో జాప్యానికి కారణమని అధికారులంటున్నారు. మరోవైపు ఈ-క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతుల నుంచే పంట కొనుగోలు చేస్తామని అధికారులు తాజాగా ప్రకటించారు. ఈ కొత్త నిబంధనతో రైతులు మళ్లీ వ్యవసాయశాఖ అధికారుల దగ్గరకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఇదిలావుంటే సాంకేతిక సమస్య వల్లే కేంద్రాలు ప్రారంభించటంలో ఆలస్యం జరుగుతుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే 20శాతం రైతులు అప్పులపై వడ్డీ భారం భరించలేక 4వేల రూపాయలకే దళారులకు అమ్ముకున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వేరుశనగ కొనుగోలు కేంద్రాలను త్వరగా అందుబాటులోకి తేవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి