అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని జాతీయ రహదారిపై అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం తమ సరకులు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు పవన్ ఫార్మర్స్ వేర్ హౌస్ గోదాములో నిల్వ ఉంచారు. వజ్రకరూర్, విడపనకల్లు మండలాలకు చెందిన రైతులు దాదాపు రూ. 6 కోట్ల సరకును గిడ్డంగుల్లో పెట్టామన్నారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాము పంటలు వేసుకోవడానికి అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడం కోసం గోదాంకు వెళ్లి చూడగా తాళం వేసి ఉంది.
సదరు గోదాము యాజమాన్యం ఎన్సీఎమ్ఎల్ సంస్థ నుంచి తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆ సంస్థ వారు గోదాముకు తాళం వేశారు. రైతులకు సంబంధించిన నిల్వ మొత్తం గోదాములలో చిక్కుకుపోయింది. గత 20 రోజులుగా తాము నిల్వ ఉంచిన ధాన్యము తిరిగి తీసుకెళ్లడానికి గోదాం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా… సంబంధిత గోదాం యాజమాన్యం ఎవరూ స్పందించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెంది జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ప్రభుత్వ అధికారులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని లేదంటే తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ వారి ఆవేదన తెలిపారు. సమాచారం అందుకున్న వజ్రకరూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల సమక్షంలో ఎన్సీఎమ్ఎల్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి అన్నదాతల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతన్నలు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి :