అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని రైతులు ఎన్నో ఆశలతో రబీలో పప్పుశెనగ విత్తనాలు నాటారు. విత్తనం విత్తి దాదాపు 20 రోజులు అవుతున్నా... మొలకెత్తక పోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రధానంగా పెద్దపొలమడ, కోమలి, చిన్నపొలమడ, రావి వెంకటాంపల్లి, దిగువపల్లి, ఎగువపల్లి, కొండేపల్లి, ఎర్రగుంటపల్లి....గ్రామాల్లో వేలాది ఎకరాల్లో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ విత్తనాలతో రైతులు సాగు చేస్తున్నారు.
ప్రభుత్వం నాసిరకం విత్తనాలు పంపిణీ చేసిందని కొందరు, విత్తనం విత్తిన సమయం నుంచి వరుసగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మొలకెత్తలేదని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరాకు పది వేల రూపాయలు వెచ్చించి, వేసిన పంట మొలకెత్తక పోవటంతో చేసేది లేక పంటను తొలగిస్తున్నారు. సాగుకు ఇంకా సమయం ఉండటంతో అప్పులు చేసి మరో మారు పప్పు శెనగ విత్తనాన్ని వేయనున్నారు. ఒక పంట సాగుకు రెండు మార్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ...