కరోనా ప్రభావం పలు రంగాలపై పడుతుంది. అనంతపురం జిల్లాలో పలుచోట్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యావసర వస్తువుల ధరలపై అధికారులు స్పందించాలి
కరోనా ప్రభావంతో ఈనెల 31 వరకు జనాభా ఇంటికే పరిమితం అవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులు ముందుకంటే ఎక్కువ రేటు నిర్ణయించి కూరగాయలను అమ్ముతున్నారు. ఫలితంగా నిత్యావసరాల నిమిత్తం మార్కెట్లకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అందరూ బాగుండాలనే ఉత్సవాలు రద్దు
గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామానికి చెందిన దర్గాలో ఏటా మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలను కరోనా కారణంగా రద్దు చేశారు. ఇతరులకు అనుమతి ఇవ్వకుండా కేవలం వంశీయులకు మాత్రమే అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ దర్గాకు స్థానికులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకునేవారు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు స్వచ్ఛందంగా ఈసారి తాము ఉత్సవాలను జరుపుకోబోమని తెలిపారు.
కరోనా కట్టడికి మృత్యుంజయ హోమం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ని కట్టడి చేయడానికి అనంతపురంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. నగరంలోని 1వ రోడ్లో ఉన్న శ్రీ కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు సంయుక్తంగా మహా మృత్యుంజయ హోమం, నవగ్రహ, రుద్రహోమం జరిపారు. కరోనా వైరస్ అంతమవ్వాలని ముక్కోటి దేవతలను ప్రార్థించినట్లు అర్చకులు తెలిపారు. ప్రజలు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.