అనంతపురం జిల్లాలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. గత నెల 20 నాటికి ఆరు మరణాలు మాత్రమే నమోదు కాగా.. గురువారం నాటికి మరణాల సంఖ్య 20కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బులెటిన్‌లో మరో రెండు మరణాలు నమోదయ్యాయి. ఇదే క్రమంలో కేసుల నమోదు కూడా ఏమాత్రం తగ్గలేదు. కొత్తగా 91 మందికి పాజిటివ్ వచ్చింది. వీరితో కలిపితే మొత్తం బాధితుల సంఖ్య 2,659కి పెరిగింది. ఇప్పటికే కోలుకున్న 1,655 మంది డిశ్ఛార్జి కాగా.. ఇంకా 984 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకొని గురువారం 48 మంది డిశ్ఛార్జి అయ్యారని కలెక్టర్ చంద్రుడు పేర్కొన్నారు.
ధర్మవరంలో 23 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని పీఆర్‌టీ కాలనీలో ఐదుగురికి, తొగటవీధిలో ఇద్దరికి, బోయవీధిలో ఇద్దరికి, గూడ్స్‌షెడ్‌కొట్టాలలో ముగ్గురికి, కేశవనగర్‌లో ఇద్దరికి, మార్కెట్ వీధిలో, సాయినగర్‌లో, గుట్టకిందపల్లిలో, శివానగర్‌లో, గీతానగర్‌లో, తారకరామాపురంలో, ఆర్పీఎఫ్ సిబ్బందికి ఒకరొకరు చొప్పున కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ధర్మవరం మండలం పోతుకుంటలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు ధర్మవరం పట్టణంలో 191, మండలంలో 15 కేసులు నమోదయ్యాయి.
బత్తలపల్లి ఆర్డీటీ కొవిడ్ ఆసుపత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతూ.. అనంతపురం నగరానికి చెందిన ఒకరు గురువారం మృతిచెందినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
గత 24 గంటల వ్యవధిలో కదిరి ప్రభుత్వ ఆస్పత్రి పరిధిలో 16 మందికి వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. తహసీల్దార్ మారుతి, డీఎస్పీ షేక్‌లాల్ అహమ్మద్, ఆరోగ్య సిబ్బంది కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఇదీ చదవండి: