అతను చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం... ప్రవృత్తి మాత్రం దొంగతనం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అధికారుల కళ్లు గప్పి ... తాను విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్లోనే వస్తువులను దొంగిలించాడు.
అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లో జీఆర్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు మంజునాథ్. ఆదోనిలో తన కుటుంబంతోపాటు నివసించేవాడు. సైకోగా మారిన మంజునాథ్... స్టేషన్ నుంచి ఎత్తుకెళ్లిన సంకెళ్లను తన భార్యకు వేసి ఇంట్లో చిత్రహింసలు పెట్టేవాడు. అతని ప్రవర్తనతో విసుగు చెందిన బాధితురాలు.... భర్త మీద ఆదోనిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మంజునాథ్ ఇంట్లో బుధవారం తనిఖీ చేశారు. అక్కడి వస్తువులను చూసి ఖంగుతిన్నారు.
12 ప్రధాన శాఖలకు చెందిన నకిలీ సీల్‌తో పాటు గుత్తి పోలీస్ స్టేషన్లో దస్త్రాలు, స్టేషన్‌కి చెందిన కొన్ని వస్తువులు, సంకెళ్లను దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్నాడు. అక్రమంగా ఇంట్లో ప్రభుత్వ శాఖలకు చెందిన విలువైన వస్తువులు దాచినందుకు గాను సెక్షన్ 379, 409, 406 కింద అతనిపై కేసు నమోదు చేశారు జీఆర్పీ అధికారులు.
గతంలో ప్రేమ వివాహం చేసుకుని (ముస్లింగా)మత మార్పిడి చేసుకున్న మంజునాథ్... ఈ విషయాన్ని అధికారులకు తెలపకుండా విధులు నిర్వహించాడు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు తెలిపి... మంజునాథ్‌పై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.